అహ్మదాబాద్, సెప్టెంబర్ 16: ‘వందే మెట్రో’ రైళ్ల పేరును ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’గా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు మొదటి రైలు ప్రారంభానికి ముందు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మెట్రో రైళ్లు నగరాల్లోనే నడిచేవి. నగరాల మధ్య మెట్రో రైళ్లు నడిపించాలనే ఆలోచనతో ఈ నూతన రైళ్లను రైల్వే శాఖ తీసుకువస్తున్నది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ – భుజ్ మధ్య నడిచే మొదటి ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం అహ్మదాబాద్‌లో ప్రారంభించారు. నాగ్‌పూర్ – సికింద్రాబాద్ మధ్య వందేభారత్ రైలు సహా పలు ఇతర రైళ్లు, అభివృద్ధి పనులను సైతం ఆయన ప్రారంభించారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: రైల్వేకు సంబంధించిన సేవలన్నీ ఒకే యాప్ ద్వారా అందుబాటులోకి తెస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ప్రకటించారు. ఈ దిశగా తమ ప్రభుత్వం సూపర్ యాప్ తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం రైల్వే సేవలు అందించే యాప్‌లపై ప్రయాణికుల్లో గందరగోళం ఉన్నది. రకరకాల యాప్‌లు ఉన్నాయి. వీటిల్లో కొన్ని ప్రైవేటువి కూడా ఉన్నాయి. దీంతో ఏ సేవల కోసం ఏ యాప్ వాడాలో అర్థం కాని పరిస్థితి ఉంది. కాగా, గత ఏడాది దేశంలో 5,300 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ వేశామని, ఇది స్విట్జర్లాండ్ మొత్తం రైల్వే వ్యవస్థతో సమానమని మంత్రితెలిపారు. పదేండ్ల క్రితం ఏడాదికి సగటున 171 రైలు ప్రమాదాలు జరిగేవని, ఇప్పుడు 40కి తగ్గాయని ఆయన పేర్కొన్నారు.