ఐజ్వాల్/ఇంఫాల్, జూలై 25: మణిపూర్ హింసపై పొరుగు ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మంగళవారం పెద్దయెత్తున ఆందోళనలు జరిగాయి. కుకీ-జో తెగ ప్రజలకు మద్దతుగా పౌర సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ర్యాలీల్లో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. రాజధాని ఐజ్వాల్‌లో జరిగిన భారీ ర్యాలీలో సీఎం జోరంతంగాతో పాటు మంత్రులు, పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ శాంతియుత ఆందోళనల్లో వేలాదిగా పాల్గొన్న సాధారణ ప్రజలు.. మణిపూర్‌లో హింస, మహిళలపై లైంగిక దాడుల ఘటనను నిరసిస్తూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. గత కొన్నేండ్లలో ఐజ్వాల్‌లో ఇంత భారీ సంఖ్యలో ప్రజలతో ఆందోళన చేయడం ఇదే ప్రథమం. ఈ ఆందోళన కార్యక్రమానికి మద్దతుగా అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)తో పాటు ప్రతిపక్ష పార్టీలు తమ కార్యాలయాలను మూసివేశాయి.
ఐజ్వాల్‌లో ర్యాలీని ఉద్దేశించి ఎన్జీవో కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ ఆర్ లాలుంఘెటా మాట్లాడుతూ మణిపూర్‌లో హింసకు ముగింపు పలకాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘కేంద్రం మమ్మల్ని భారతీయులుగా భావిస్తే.. మణిపూర్‌లో జో తెగ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపాలి’ అని పేర్కొన్నారు. మణిపూర్‌లో ఘర్షణల బాధితులకు పరిహారం ఇవ్వాలని, మహిళల నగ్న ఊరేగింపు ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు తీర్మానం చేశారు.
మణిపూర్ సంక్షోభానికి తాత్కాలిక పరిష్కారాలు మార్గం కాదని, శాశ్వత రాజకీయ పరిష్కారం చూపాలని మిజోరం సీఎం జోరంతంగా కేంద్రాన్ని కోరారు. తాము ఎన్డీయేలో భాగమైనప్పటికీ, మిజో ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే ఏ అంశాన్ని అయినా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మణిపూర్ ప్రభుత్వం మంగళవారం పాక్షికంగా సడలించింది. అయితే మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతుందని హోం శాఖ పేర్కొన్నది. మణిపూర్ అంశంపై పార్లమెంట్ స్తంభించడానికి ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వమే కారణమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా విమర్శించారు. మణిపూర్‌లో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం విఫలమైందని చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు.