జైపూర్: రాజస్థాన్‌కు చెందిన 78 ఏళ్ల తీతర్ సింగ్(Teetar Singh) .. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా పోటీ చేస్తున్నారు. గత 50 ఏళ్ల నుంచి అతను ఆ రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఎన్నికల్లో పోటీ చేసినా ఆయన ఒక్కసారి కూడా గెలవలేదు. ఇప్పటి వరకు దాదాపు 20 ఎన్నికల్లో ఆ వ్యక్తి పోటీ చేసి .. అన్నింటిలోనూ ఓటమి పాలయ్యారు. దళిత వర్గానికి చెందిన తీతర్ సింగ్ మాత్రం తన పోరాట స్పూర్తిని వదలడం లేదు. 1970 నుంచి రకరకాల ఎన్నికల్లో పోటీ చేస్తున్న తీతర్.. ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి పోటీలో నిలిచాడు.
మన్రేగా కూలిగా జీవితాన్ని కొనసాగిస్తున్న తీతర్‌సింగ్.. కరాన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గడిచిన 50 ఏళ్ల నుంచి అతను పంచాయతీ ఎన్నికల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకు పోటీ చేశారు. ప్రభుత్వం తమకు భూములు ఇవ్వాలని, సదుపాయాలను కల్పించాలని అతను డిమాండ్ చేస్తున్నాడు. ఈ ఎన్నికలు తమ హక్కుల గురించి జరుగుతున్న పోరాటమని పేర్కొన్నాడు. మన్రేగాలో లేబర్‌గా చేస్తున్న ఆ వృద్ధుడు … పాపులారిటీ కోసమో .. రికార్డుల కోసమో తాను పోటీ చేయడం లేదన్నాడు. తన హక్కులను సాధించేందుకు ఓటును ఆయుధంగా వాడనున్నట్లు తెలిపాడు.
1970 దశకలో కెనాల్ కమాండ్ ఏరియాలో తనకు భూమి ఇవ్వలేదని, తనలాంటి వాళ్లు చాలా మంది భూముల్ని కోల్పోయారని, అందుకే అప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తీతర్ సింగ్ తెలిపాడు. భూమిలేని వాళ్లకు, నిరుపేద కార్మికులకు ప్రభుత్వం భూమి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా ఎన్నికల్లో పోటీ చేస్తుంటానని చెప్పాడు. ఎన్ని ఎన్నికల్లో పోటీ చేసినా.. ప్రభుత్వం తనకు మాత్రం గజం భూమి కూడా ఇవ్వలేదన్నారు.
లేబర్ పనిచేసే తీతర్ సింగ్‌కు.. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 938 ఓట్లు పోలయ్యాయి. 2013 ఎన్నికల్లో 427, 2018 ఎన్నికల్లో 653 ఓట్లు పోలయ్యాయి. పోటీ చేసిన ప్రతిసారీ.. తీతర్ తన డిపాజిట్ డబ్బులు కోల్పోయేవాడు. కానీ విజయం ఆయన్ను ఇంకా వరించలేదు.