Jamia University | ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనలు జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీకి కూడా పాకింది. జేఎన్‌యూ తర్వాత జామియా మిలియా క్యాంపస్‌లో డాక్యుమెంటరీ ప్రదర్శన వాతావరణాన్ని వేడెక్కించింది. డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ప్రయత్నించిన నలుగురు విద్యార్థులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
జామియా మిలియా ఇస్లామియా క్యాంపస్‌లో ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రదర్శనను చేపడుతున్న స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) కు చెందిన నలుగురు విద్యార్థులను బుధవారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు కూడా ధ్రువీకరించారు. ఈ వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌కు అనుమతి లేదని యూనివర్శిటీ పరిపాలనా ఉన్నతాధికారులు తెలిపారు. యూనివర్శిటీ క్యాంపస్‌లో వాతావరణాన్ని నాశనం చేసేందుకు కొన్ని స్వార్ధశక్తులు ఇలాంటి చర్యలు పాల్పడ్డారని, వీరిపై చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు.
సాయంత్రం 6 గంటలకు స్క్రీనింగ్ ప్లాన్ చేయడానికి కొన్ని గంటల ముందు నలుగురు ఎస్ఎఫ్ఐ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. క్యాంపస్‌లో డాక్యుమెటరీ ప్రదర్శిస్తున్నట్లు సమాచారం రాగానే నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు యూనివర్శిటీ అధికారులు చెప్పారు. డాక్యుమెంటరీ ప్రదర్శనకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని, తాము అనుమతి కూడా ఇవ్వలేదని వారు స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారిలో అజీజ్, నైవేద్య, అభిరాం, తేజస్ ఉన్నట్లుగా సమాచారం. ఎంసీఆర్సీ లాన్ గేట్ నంబర్ 8 వద్ద సాయంత్రం 6 గంటలకు డాక్యుమెంటరీ ప్రదర్శిస్తున్నట్లు తెలిపే పోస్టర్‌ను ఎస్ఎఫ్ఐ జామియా యూనిట్ విడుదల చేసింది.