ముంబై: దక్షిణ ముంబైకి చెందిన 93 ఏళ్ల వృద్ధురాలు ఎలైస్ డిసౌజా (Alice D’souza) 83 ఏళ్ల క్రితం తాను కోల్పోయిన ఫ్లాట్స్ కోసం కోర్టుల్లో సుదీర్ఘ పోరాటం చేసి ఎట్టకేలకు విజయం సాధించింది. ఈ నెల 4న కేసు విచారణ జరిపిన బాంబే హైకోర్టు (Bombay High Court) పిటిషనర్‌కు తన ఫ్లాట్స్‌ను హ్యాండ్ ఓవర్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో 8 దశాబ్దాల నాటి భూవివాదానికి నేటితో తెరపడింది. డిసౌజా పోరాటం ఫలించింది.
వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ ముంబైలోని ఎలైస్ డిసౌజాకు రూబీ మాన్షన్‌లో రెండు ఫ్లాట్స్ ఉన్నాయి. అయితే 1942 మార్చి 28న ఆమె తన రెండు ఫ్లాట్స్‌ను బ్రిటిష్ ప్రభుత్వ అధికారులకు కోల్పోయింది. అప్పటి భారత రక్షణ చట్టం కింద ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ ఆస్తులను ఆక్రమించుకునేందుకు బ్రిటిష్ పాలకులు అనుమతించారు. దాంతో ఆమె తన రెండు ఫ్లాట్స్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అయితే, ప్రభుత్వ అధికారులు ఆక్రమించుకున్న ప్రైవేట్ ఆస్తులను వాటి యజమానులకు తిరిగి అప్పగించాలని 1946లో బ్రిటిష్ ఇండియా సర్కారు ఆదేశాలు జారీచేసింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరూ తమతమ ఆస్తులను వాటి అసలు యజమానులకు అప్పగించినా డిసౌజా ఫ్లాట్స్‌ను ఆక్రమించుకున్న అధికారి మాత్రం వాటిని ఆమెకు తిరిగి ఇవ్వలేదు. దాంతో ఆమె గత 80 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ పోరాడుతోంది. అప్పుడు అధికారి కబ్జాలో ఉన్న ఫ్లాట్స్ ఇప్పుడు ఆయన వారసుల కబ్జాలో ఉన్నాయి. దాంతో తన ఫ్లాట్స్ తనకు అప్పగించేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ డిసౌజా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో గత గురువారం డిసౌజాకు అనుకూలంగా బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా డిసౌజా ఫ్లాట్స్‌ను ఖాళీ చేయించి ఆమెకు అప్పగించాలని మహారాష్ట్ర సర్కారును ఆదేశించింది.