న్యూఢిల్లీ: తాలిబన్ నాయకుడు, అఫ్గాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలతోపాటు పలువురు మహిళా జర్నలిస్టులు సైతం మోదీ ప్రభుత్వ మౌనాన్ని ప్రశ్నించారు.
అయితే విదేశాంగ శాఖ మాత్రం అది తమ నిర్ణయం కాదని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది. న్యూఢిల్లీలోని అఫ్గాన్ ఎంబసీలో తాలిబన్ అధికారులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏ జర్నలిస్టులను ఆహ్వానించాలో వారే నిర్ణయించారని, ఇందులో తమ ప్రమేయమేమీ లేదని విదేశాంగ అధికారులు చెప్పినట్లు వార్తాకథనాలు వెలువడ్డాయి.
మహిళా జర్నలిస్టులను కూడా ఆహ్వానించాలని భారత అధికారులు సూచించినప్పటికీ తాలిబన్ ఎంబసీ అధికారులు పట్టించుకోలేదని కూడా కొన్ని వార్తలు వెలువడ్డాయి. దీనిపై మోదీ ప్రభుత్వం మౌనం వహించడం పట్ల జర్నలిస్టులు అసహనాన్ని వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్టులను మినహాయించడాన్ని మీరు ఆమోదించారా అని విదేశాంగ శాఖను ది హిందూ దినపత్రిక సీనియర్ జర్నలిస్టు సుహాసినీ హైదర్ ప్రశ్నించారు. పురుష జర్నలిస్టులు విలేకరుల సమావేశం నుంచి వాకౌట్ చేసి ఉండవలసిందని అదే పత్రిక డిప్యుటీ ఎడిటర్ విజైతా సింగ్ వ్యాఖ్యానించారు.