మహిళలపై నేరాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు టాప్!
ఆ పార్టీకి చెందిన 106 మంది ప్రజాప్రతినిధులపై ఆ తరహా కేసులు.. బెంగాల్లో 63 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎంపీలపై కేసులు.
- తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా
- దేశవ్యాప్తంగా ఇద్దరు ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలపై రేప్ కేసులు
- ఏడీఆర్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబర్ 24: మహిళలపై నేరాలకు పాల్పడినట్టు కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల్లో బీజేపీకి చెందిన వారు మొదటి స్థానంలో ఉన్నారు. బీజేపీకి చెందిన 95 మంది ఎమ్మెల్యేలు, 10 మంది లోక్‌సభ ఎంపీలు, ఒక రాజ్యసభ ఎంపీ మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్నారు. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో రాష్ర్టాలలో మొదటి స్థానంలో పశ్చిమ బెంగాల్, ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది.
బెంగాల్లో 63 మంది ఎమ్మెల్యేలు, నలుగురు లోక్‌సభ ఎంపీలు, ఇద్దరు రాజ్యసభ ఎంపీలు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు ఎన్నికల సంఘానికి సమర్పించిన తమ అఫిడవిట్లలో మహిళలపై నేరాలకు సంబంధించిన పెండింగ్ కేసుల వివరాలను పొందుపరిచారు. ఆంధప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల్లో మహిళలపై నేరాలకు సంబంధించి పెండింగ్ కేసులు ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య వరుసగా 22, 17గా ఉంది. దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన ఇద్దరు లోక్‌సభ ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలపై రేప్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
వీరిలో ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు బెంగాల్‌కు చెందినవారు. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి బీజేపీకి చెందిన ఇద్దరు ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఇద్దరు ప్రస్తుత ఎంపీలు, కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, అలాగే టీడీపీ, డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, భారత్ ఆదివాసీ పార్టీ, ఏఐఎస్ఎఫ్ పార్టీల నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే చొప్పున తమపై రేప్ రేసులు పెండింగ్‌లో ఉన్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం పదవిలో ఉన్న 772 మంది ఎంపీలు, 4,109 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను విశ్లేషించగా 168 మంది ఎమ్మెల్యేలు, 19 మంది ఎంపీలు తమపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు నమోదైనట్టు పేర్కొన్నారని తేలింది.
17 మంది టీడీపీ ఎమ్మెల్యేలపై..
కాంగ్రెస్‌కు చెందిన 19 మంది ఎమ్మెల్యేలు, ఒక లోక్‌సభ ఎంపీపై ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి. టీడీపీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ ఎంపీ. తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, ఒక స్వతంత్ర లోక్‌సభ ఎంపీ, ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఇటువంటి ఆరోపణలే ఎదుర్కొంటున్నారు. యాసిడ్ దాడి, లైంగిక దాడి, పరువుకు భంగం కలిగించడం, లైంగిక వేధింపులు, పెండ్లి చేసుకోవాలని బలవంతం చేయడానికి మహిళను అపహరించడం లేదా బెదిరించడం లాంటివి ఉన్నాయి.
ఎన్నికల్లో పోటీచేసే ముందు నేర చరిత్ర కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయడానికి గల కారణాలను వెల్లడించాలని 2020 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ అభ్యర్థుల నేర చరిత్రను వెల్లడించాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను రాజకీయ పార్టీలు ఇంకా పాటించడం లేదని ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది. ఇలా కేసులను, నేర చరిత్రలను దాచిపెడుతూ పార్టీలు తమ అభ్యర్థులకు టికెట్లు ఇస్తున్నట్టు ఈ నివేదిక బయటపెట్టింది. మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చేది తామే అని చెప్పుకునే బీజేపీ దీనిపై మౌనంగానే ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

