Ranjana Nachiyaar : త్రిభాషా సూత్రం (Three-language imposition) పై తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతోంది. జాతీయ విద్యావిధానం – 2020 (NEP-2020) ప్రకారం రాష్ట్రాలు తప్పనిసరిగా త్రిభాషా (హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాష) సూత్రాన్ని అమలు చేయాలని కేంద్ర ఆదేశాలు జారీచేయడం.. ఆ ఆదేశాలను తమిళనాడు సర్కారు తిరస్కరించడం వివాదానికి కారణమైంది.
జాతీయ విద్యావిధానం 2020 ప్రకారం పాఠశాలల్లో ఇంగ్లిష్, ప్రాంతీయ భాషతోపాటు హిందీ లాంగ్వేజ్‌ను కూడా తప్పనిసరి చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే హిందీ భాషను ప్రవేశపెట్టేందుకు తమిళనాడు సర్కారు ససేమిరా అంటోంది. అది భవిష్యత్తులో తమిళభాషను మరుగున పడేస్తుందని వాదిస్తోంది. హిందీ కారణంగానే ఉత్తరాదిలో ప్రాంతీయ భాషల పరిధి తగ్గిందని చెబుతోంది.
అయితే తమిళ సర్కారు వాదనను కేంద్ర ఖండిస్తోంది. స్టాలిన్ ప్రభుత్వ వాదనలో పసలేదని అంటోంది. విద్యార్థులకు అదనంగా మరో భాషను నేర్పడంవల్ల నష్టం ఏముంటుందని ప్రశ్నిస్తోంది. త్రిభాషా సూత్రాన్ని అమలు చేయని రాష్ట్రాలకు విద్యానిధులు అందజేయబోమని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన నటి, బీజేపీ నాయకురాలు రంజనా నచియార్ (Ranjana Nachiyaar ) ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
తమిళనాడులో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని బలవంతపెట్టడం తప్పని, తమిళ భాష ప్రభను తగ్గించే ఆ సూత్రానికి తాను వ్యతిరేకమని ఆమె చెప్పారు. ఈ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ తాను బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.