GVG Yugandhar | ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) చీఫ్ జీవీజీ యుగంధర్‌కు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) భద్రత కల్పించారు. జూన్ 16 నుంచి అమలులోకి వచ్చేలా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న యుగంధర్‌కు ఎక్స్ కేటగిరి భద్రత కల్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఎయిర్ ఇండియా ప్రమాదంపై ఏఏఐబీ దర్యాప్తు చేస్తున్న సమయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 12న లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ క్యాంపస్‌పై కుప్పకూలింది. ఈ ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా 242 మందిలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలం నుంచి బ్లాక్ బాక్స్‌ను సేకరించారు. అందులోని డేటాను విజయవంతంగా ఏఏఐబీ ల్యాబ్‌లో డౌన్లోడ్ చేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి.