ముంబై (నమస్తే తెలంగాణ): నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియాన్పై లైంగిక దాడి జరిందని, ఆమె మరణించిన ఐదేండ్ల తర్వాత ఆమె తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాకరేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బాంబే హైకోర్టును గురువారం ఆశ్రయించారు. అయితే తనను అప్రతిష్ట పాల్జేయడానికి బీజేపీ ప్రభుత్వం ఈ కుయుక్తులకు పాల్పడుతోందని, తన వాదనను కోర్టులో వినిపిస్తానని ఆదిత్య వెల్లడించారు. ముంబైలో శివార్లలోని ఓ భవనం 14వ అంతస్తు పైనుంచి పడి 2020 జూన్ 8న దిశా సాలియాన్ మరణించారు. పోలీసులు దీన్ని ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా(ఏడీఆర్)గా కేసు నమోదు చేశారు.
ఇది జరిగిన ఆరు రోజుల తర్వాత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ బాంద్రాలోని తన ఫ్లాట్లో శవమై కనిపించారు.తన కుమార్తె మరణంపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని, దర్యాప్తు పట్ల తనకు పూర్తి సంతృప్తిగా ఉందని 2020లో సతీష్ సాలియాన్ పోలీసులకు తెలిపారు. కాగా, తాజా పిటిషన్లో ఆయన అనేక సంచలనాత్మక ఆరోపణలు చేశారు.
తన కుమార్తెపై రేప్ జరిగిందని, ఆ తర్వాత ఆమెను చంపివేశారని సాక్షుల కథనాలను ఉటంకిస్తూ ఆయన ఆరోపించారు. 14వ అంతస్తు నుంచి పడిపోయి మరణించిందని చెబుతున్న తన కూతురి శరీరంపై ఒక్క ఫ్రాక్చర్ కూడా లేదని, ఆమె కింద పడిన ప్రదేశంలో రక్తం కూడా లేదని పిటిషన్లో ఆయన తెలిపారు. ఈ నేరంలో ప్రధాన నిందితుడు ఆదిత్య ఠాకరే అని ఆయన ఆరోపించారు.