
నిష్థా… 28 ఏళ్ల యువతి. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉంటుంది. కమ్యూనికేషన్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తోంది. మార్కెట్ పనులు పూర్తి చేసుకొని ఆటోలో తన ఇంటికి తిరుగు ప్రయాణమైంది. ఆటో డ్రైవర్‌కు తన ఇంటి అడ్రెస్ కూడా చెప్పింది. అయితే ఆ ఆటో డ్రైవర్ తన ఇంటి అడ్రెస్ వైపు కాకుండా… మరో వైపు ఆటోను తీసుకెళ్తున్నాడు. ఆ యువతి ఇటు వైపు కాదు… నేను ఈ అడ్రస్ చెప్పలేదు కదా… అటు వైపు వెళ్లండి. అంటూ పదే పదే చెబుతోంది. అయినా ఆ ఆటో డ్రైవర్ ఆ మాటలే వినలేదు. చివరికి ఆ యువతికి అర్థమైపోయింది. తనను ఆ ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని. ఆ క్షణమే ఏమీ ఆలోచించకుండా ఆ ఆటోలోంచి దూకింది. ఈ విషయాన్ని నిష్థాయే ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అసలు ఏం జరిగిందంటే…
హర్యానా గురుగ్రామ్‌లోని సెక్టార్ 22 లో నిష్థా కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె తన మార్కెట్ పనుల నిమిత్తమై మార్కెట్‌కు వెళ్లి, ఇంటికి తిరుగు ప్రయాణం కావడానికి ఓ ఆటోను మాట్లాడింది. పేటీఎమ్ ద్వారా డబ్బులు చెల్లిస్తానని డ్రైవర్‌తో చెప్పింది. డ్రైవర్ కూడా ఓకే చెప్పాడు. ”నేను ఆటో ఎక్కా. ఆటో డ్రైవర్ భక్తి పాటలు వినడం ప్రారంభించాడు. ఓ టీపాయింట్ వద్దకు చేరుకున్నాం. అక్కడి నుంచి మా ఇంటికి వెళ్లాలంటే కుడి వైపు మళ్లాలి. కానీ ఆ డ్రైవర్ ఎడమ వైపుకు ఆటోను మళ్లించాడు. ఎందుకు అలా మళ్లించావ్ అని నేను సూటిగానే ప్రశ్నించా. అయినా డ్రైవర్ సమాధానమివ్వడం లేదు.
పైగా దేవుడి పేరు తీసుకుంటూ బిగ్గరగా అరుస్తున్నాడు. అప్పటికే ఓ పది సార్లు ఆయన భుజం తట్టాను. అయినా ఉలుకూ లేదు. పలుకూ లేదు. ఇక నన్ను కిడ్నాప్ చేస్తున్నాడని గ్రహించి, నడుస్తున్న ఆటోలోంచి కిందికి దూకేశా. ధైర్యం ఎలా వచ్చిందో నాకే తెలియదు. అయితే దెబ్బలు మాత్రం తాకాయి. కిడ్నాప్ అవడం కంటే.. ఎముకలు ఇరిగినా పర్లేదని అనుకున్నా. ఆ తర్వాత ఓ ఈ రిక్షాను తీసుకొని, ఇంటికి చేరుకున్నా” అని ఆ యువతి తెలిపింది. అయితే తొందర్లో ఆ ఆటో నెంబర్ రాసుకోవడం తాను మరిచిపోయాయని పేర్కొంది. అయితే పోలీసులు ఈ ఘటనపై స్పందించారు. ఆ ఆటోను ట్రేస్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని, అతి త్వరలోనే ఆ ఆటోను కనుక్కొంటామని పోలీసులు పేర్కొన్నారు.