అగర్తలా: అధికార బీజేపీ ఎమ్మెల్యే అశ్లీల వీడియో చూసిన ఘటనపై త్రిపుర అసెంబ్లీలో శుక్రవారం మధ్యాహ్నం పెద్ద రచ్చ జరిగింది. బాగ్బస్సా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లక్నాథ్ గతంలో అసెంబ్లీలో పోర్న్ వీడియో చూసినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో అదే అంశాన్ని ప్రతిపక్ష టిప్ర మోతా పార్టీ ఎమ్మెల్యే అనిమేశ్ దెబ్బర్మ లేవనెత్తారు.
దీనిపై అధికార బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. దాంతో ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఎం సభ్యులు కూడా టిప్ర మోతా పార్టీ సభ్యులతో జత కలిసి అధికార బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు దూషించుకున్నారు. సభ్యుల అరుపులు, కేకలతో అసెంబ్లీ దద్దరిల్లింది.
#WATCH | Agartala | A ruckus broke out between the MLAs of BJP & Tipra MOTHA party during Tripura Assembly session today. pic.twitter.com/hdEBpOoEXD
— ANI (@ANI) July 7, 2023
ఈ క్రమంలో స్పీకర్ విశ్వబంద్ సేన్.. ఎక్కువగా రచ్చ చేసిన ఐదుగురు ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండ్ అయిన ఐదుగురిలో ముగ్గురు టిప్ర మోతా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా ఇద్దరిలో ఒకరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాగా, మరొకరు సీపీఎం ఎమ్మెల్యే. కాగా, స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ మిగతా ప్రతిపక్ష సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు.