జలాన్ (యూపీ) : ఉత్తరప్రదేశ్లో మైనర్ కుమార్తెపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారని ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో విసుగుచెందిన ఆ తండ్రి చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. జలాన్లో నివాసముండే బాలికను పథకం ప్రకారమే ఇద్దరు వ్యక్తులు మార్చి 28న పుట్టినరోజు వేడుకకు తీసుకెళ్లారు. అనంతరం సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. వీరి నుంచి తప్పించుకొని ఇంటికి వచ్చిన బాలిక విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. పైగా ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని బలవంతం చేశారు. ఎస్పీని కలిసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విసిగిపోయిన ఆ తండ్రి ఏప్రిల్ 2న చెట్టుకు ఉరివేసుకొని ప్రాణాలుతీసుకున్నాడు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో స్పందించిన పోలీసులు తాజాగా మంగళవారం ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.