తిరువనంతపురం: కేరళలో ఓ బిచ్చగాడు(Kerala Beggar) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అయితే అతని వద్ద ఉన్న కంటేనర్‌లో సుమారు నాలుగున్న లక్షల నగదును సీజ్ చేశారు. అలప్పుజాలో ఈ ఘటన జరిగింది. వాస్తవానికి ఆ ప్రాంత ప్రజలకు ఆ యాచకుడు సుపరిచితం. రోజూ అతను ఆ ఏరియాలోనే అడుక్కుంటూ తిరుగుతుంటాడు. అయితే సోమవారం రాత్రి ఆ బిచ్చగాడు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో అతని పేరును అనిల్ కిశోర్‌గా నమోదు చేశారు.
అయితే మంగళవారం ఉదయం ఓ షాపు వద్ద కిశోర్ మృతదేహాన్ని గుర్తించారు. పోస్టు మార్టమ్ కోసం అతని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అతని బాడీ వద్ద ఓ కంటేనర్‌ను గుర్తించారు. ఇన్స్పెక్షన్ కోసం దాన్ని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్థానిక పంచాయతీ సభ్యుడు ఫిలిప్ ఉమ్మన్ సమక్షంలో ఆ బిచ్చగాడి కంటేనర్‌ను ఓపెన్ చేశారు. దాంట్లో నగదును గుర్తించారు. ఆ అమౌంట్ మొత్తం విలువ సుమారు 4.5 లక్షలు ఉన్నట్లు తేల్చారు.
సీజ్ చేసిన నగదులో రద్దు అయిన రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయి. ఇంకా విదేశీ కరెన్సీ కూడా ఉన్నది. ప్లాస్టిక్ టిన్నుల్లో నగదును స్టోర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తిండి కోసం కిశోర్ డబ్బులు యాచించేవాడు అని స్థానికులు చెప్పారు. కానీ అతని వద్ద అంత డబ్బు ఉన్న విషయం ఎవరికీ తెలియదన్నారు. అందరూ షాక్‌కు గురైనట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న డబ్బును కోర్టులో జమ చేయనున్నట్లు పోలీసులు చెప్పారు.