న్యూఢిల్లీ: ఆన్లైన్లో మెడిసిన్ అమ్మకాలకు వ్యతిరేకంగా కెమిస్టులు మే 20న దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నారు. దీని వల్ల సుమారు 8 లక్షల ఫార్మసీలు ఒక రోజు పాటు మూత పడనున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్, ఢిల్లీలోని రిటైల్ డిస్ట్రిబ్యూషన్ కెమిస్ట్ ఆలయన్స్(ఆర్డీసీఏ) మద్దతుతో ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు చిన్న, స్థానిక మెడికల్ షాపులకు నష్టం కలిగిస్తున్నాయని వారు చెప్తున్నారు. కొవిడ్ సమయంలో ప్రారంభమైన ఆన్లైన్ ఫార్మసీలు ఇప్పటికీ సరైన నియంత్రణలు లేకుండానే పనిచేస్తున్నాయని కెమిస్ట్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. భారీ డిస్కౌంట్లు, ఇంటికే మందుల డెలివరీ వంటి సౌకర్యాల వల్ల స్థానిక మెడికల్ షాపులు నిలదొక్కుకోవడం కష్టమవుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. “మందులు సాధారణ డెలివరీ వస్తువులు కావు. అవి ఆరోగ్య బాధ్యతకు సంబంధించినవి. చట్టబద్ధమైన పద్ధతులు, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్‌ల పర్యవేక్షణ, అవసరమైనచోట సరైన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందులు ఇవ్వాలి” అని ఆర్డీసీఏ అధ్యక్షుడు సందీప్ నాంగియా అన్నారు. సమాజానికి సురక్షితమైన సేవలు అందించేందుకు న్యాయమైన విధానాలు ఉండాలని స్థానిక ఫార్మసిస్టులు కోరుతున్నారు. అత్యవసర మందులు అవసరమైనవారు బంద్ కారణంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. దవాఖానలు, అత్యవసర సేవల సమీపంలోని ఫార్మసీలు తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు.