న్యూఢిల్లీ: జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) ఎనిమిది అత్యవసర మందుల ధరలను 50 శాతం పెంచడానికి ఆమోదం తెలిపింది. దీంతో టీబీ, ఆస్తమా, తలసీమియా, గ్లకోమా, మానసిక ఆరోగ్య సమస్యలు తదితర రోగాలకు వాడే బెంజిపెన్సిలిన్, ఆట్రోపైన్, స్ట్రెప్టోమైసిన్, సాల్బుటమాల్, పిలోకార్పైన్, సెఫడ్రాక్సిల్, డెస్ఫెర్రొగ్జామైన్, లిథియం మందుల ధరలు పెరగనున్నాయి. ముడి సరకుల ధరలు, ఉత్పత్తి ఖర్చులు పెరిగి పోవడంతో ఆయా మందుల ఉత్పత్తి ఆచరణ సాధ్యం కాకుండా పోయిందని తయారీ కంపెనీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో వాటి ధరలు పెంచడానికి ఎన్పీపీఏ అంగీకరించింది.
సముద్రంలో చిక్కుకొని 67 రోజులు జీవన పోరాటం
మాస్కో: తిమింగలాలను చూడడానికి వెళ్లి సముద్రంలో చిక్కుకుపోయిన ఓ వ్యక్తి 67 రోజుల పాటు జీవన పోరాటం చేసి బతికి బయటపడ్డాడు. తన వెంట వచ్చిన సోదరుడు, మేనల్లుడు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. రష్యాకు చెందిన మైఖేల్ పిచుగన్(46) ఆగస్టు నెల ఆరంభంలో తిమింగలాలను చూడటానికి సోదరుడు, మేనల్లుడితో కలిసి చిన్న పడవలో షంటర్ ద్వీపానికి వెళ్లాడు. ఆగస్టు 9న షక్లిన్ ద్వీపానికి తిరిగి వస్తున్నప్పుడు ఇంజిన్ విఫలం కావడంతో వారి పడవ సముద్రంలో చిక్కుకుపోయింది. 67 రోజుల తర్వాత అటుగా వెళ్తున్న చేపల బోటు సిబ్బందికి పిచుగన్ బోటు కనిపించింది. స్పాట్ లైట్ వేసి చూస్తే అందులో పిచుగిన్ కనిపించడంతో వారు షాక్ తిన్నారు. పిచుగిన్ను రక్షించినప్పుడు అతడు బాగా శుష్కించి సగం బరువు కోల్పోయాడు. అతడు రెండు నెలలకు పైగా సముద్రంలో ఎలా ప్రాణాలు నిలుపుకోగలిగాడో ఇంకా తెలియలేదు.