న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్ పైలట్లు ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీలో బూతులు మాట్లాడుకున్నారు. తమ జీతాల సమస్యలపై అభ్యంతరకరమైన భాష వినియోగించారు. సుమారు ఏడుగురు ఇండిగో పైలట్లు ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీని ఈ మేరకు దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దీనిపై దర్యాప్తునకు ఆదేశించింది.
కాగా, 121.5 మెగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీని ఎమర్జెన్సీ కమ్యునికేషన్ కోసం మాత్రమే వినియోగిస్తారు. విమానం కాక్‌పిట్‌లోని పైలట్లు అత్యవసర సమయాల్లో ఈ ఫ్రీక్వెన్సీ ద్వారా మాత్రమే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌తో సంప్రదింపులు జరుపుతారు. దీంతో ఈ ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఫ్రీక్వెన్సీలో ఇండిగో పైలట్లు తమ జీతాల సమస్యలపై బూతులు మాట్లాడుకున్న విషయం బయటపడింది.
మరోవైపు కరోనా నేపథ్యంలో పైలట్ల జీతాలను ఇండిగో సంస్థ 30 శాతం మేర తగ్గించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 5న సమ్మెకు యత్నించిన కొందరు పైలట్లను ఆ సంస్థ సస్పెండ్ చేసింది. కాగా, పైలట్ల జీతాలు 8 శాతం మేర పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఏప్రిల్ 1న ఇండిగో ప్రకటించింది. ఎలాంటి అవాంతరాలు లేకపోతే నవంబర్‌లో 6.5 శాతం మేర జీతాలు పెంచుతామని తెలిపింది. అయితే 30 శాతం మేర జీతాల్లో కోత విధించి 8 శాతం మాత్రమే పెంచడంపై ఇండిగో పైలట్లు అంసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.