అహ్మదాబాద్: గుజరాత్ కేబుల్ బ్రిడ్జీ కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 141కి చేరింది. కాగా, మరణించిన వారిలో 47 మంది పిల్లలున్నారు. వీరిలో అత్యంత కనిష్ఠ వయసున్న రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నది. మోర్బిలోని మచ్చు నదిపై నిర్మించిన బ్రిటీష్ కాలం నాటి పురాతన తీగల వంతెనను రిపేర్ కోసం ఏడు నెలలుగా మూసివేశారు. అయితే గుజరాతీ కొత్త ఏడాది సందర్భంగా అక్టోబర్ 26న దీనిని తిరిగి ప్రారంభించారు. ఆదివారం సెలవు కావడంతో సుమారు ఐదు వందల మంది పర్యాటకులు ఆ వంతెనపైకి ఎక్కారు. పాత వంతెనకు మరమ్మతులు చేయడంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరుగవచ్చని తెలుస్తున్నది.
కాగా, కేబుల్ బ్రిడ్జీ కూలిన దుర్ఘటనపై ఫోరెన్సిక్ నిఫుణులు దర్యాప్తు చేస్తున్నారు. వంతెన నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. వంతెన పాతది కావడం, తీగలు బలహీనంగా ఉండటం, వంతెనపైకి ఎక్కువ మంది ఎక్కడం వంటి కారణాల వల్ల అది కూలినట్లు భావిస్తున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.