బెంగుళూరు: మాజీ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)పై.. సిట్ పోలీసులు మూడవ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. పార్టీకి చెందని మహిళను పలుమార్లు లైంగింకంగా వేధించినట్లు ఆ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 1691 పేజీలు ఉన్న ఛార్జ్‌షీట్ లో 120 మంది సాక్ష్యుల వాంగ్మూలం కూడా ఉన్నది. 2020 ఫిబ్రవరి నుంచి 2023 డిసెంబర్ వరకు పలుమార్లు ఓ మహిళపై ప్రజ్వల్ లైంగిక దాడి చేసినట్లు ఆ ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. లైంగిక చర్యకు చెందిన వీడియోలు తీసి, దాంట్లో ముఖం కనబడకుండా చేసి బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. వీడియోల ఆధారంగా మళ్లీ మళ్లీ ఆ మహిళను లైంగికంగా వేధించినట్లు ఛార్జీషీట్లో పేర్కొన్నారు.
రెండు ప్రదేశాల్లో నాలుగు సార్లు రేప్ జరిగినట్లు సిట్ తన రిపోర్టులో పేర్కొన్నది. హోలెనరసిపురలోని రేవణ్ణ ఇళ్లు చెన్నాంబిక నిలయం, హసన్‌లోని ఎంపీ ఆఫీసులో రేప్ జరిగినట్లు ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 376 (2)(N), 354 (A)(1)(2), 506, 354(B), 354(C), 201 కింద రేవణ్ణపై కేసు బుక్ చేశారు. ఐటీ చట్టంలోని 66(ఈ) కూడా నమోదు చేశారు. జేడీఎస్ నుంచి ఎన్నికైన ఓ మహిళ.. ఓ పని నిమిత్తం ప్రజ్వల్ ఆఫీసుకు వెళ్లింది. అయితే పైఫ్లోర్‌లో మాట్లాడేది ఉందని చెబుతూ ఆమెను తీసుకెళ్లిన ప్రజ్వల్.. ఆమె దుస్తులు విప్పి వేధింపులకు పాల్పడినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. రేప్‌కు ప్రయత్నించిన అతను, తన ఫోన్లో ఆ దృశ్యాలను చిత్రీకరించాడు. మళ్లీ రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి, ఒకవేళ తన కోర్కె తీర్చకుంటే ఆ వీడియోను లీక్ చేస్తానని అతను బెదిరించాడు.