ఇంఫాల్: మణిపూర్లో మళ్లీ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఉక్రుల్ జిల్లాలో కుకీలు నివసించే కుకీ తోవాయ్ గ్రామంపై శుక్రవారం తెల్లవారుజామున సాయుధ దుండగులు భారీ కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో గ్రామానికి కాపలాగా ఉన్న ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ‘సాయుధ దుండగులు వచ్చీ రాగానే గ్రామ కాపలాదారులపై కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు యువకులు చనిపోయారు. ఈ ఘటనలో ఇంకెవరికీ గాయాలు కాలేదు’ అని ఉక్రుల్ జిల్లా ఎస్పీ ఎన్ వశుమ్ తెలిపారు. కాల్పుల అనంతరం పరిసర గ్రామాల్లో పోలీసులు, సైన్యం గస్తీ పెంచినట్టు ఆయన వెల్లడించారు.