గ్యాంగ్‌టక్, జూన్ 2: సిక్కింలోని చాతెన్ మిలటరీ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు సైనికులు గల్లంతయ్యారని రక్షణ శాఖ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. మంగన్ జిల్లా లాచెన్ పట్టణం సమీపంలో భారీ వర్షాల కారణంగా ఆదివారం సాయంత్రం ఈ ఘటన సంభవించిట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు సైన్యం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చిందని రక్షణ అధికారి తెలిపారు.
‘ఈ ప్రాంతంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇక్కడి సైనిక శిబిరంపై కొండచరియలు విరిగిపడి, హవల్దార్ లఖ్విందర్ సింగ్, లాన్స్ నాయక్ మునీశ్ ఠాకూర్, పోర్టర్ అభిషేక్ లఖాడ ప్రాణాలు కోల్పోయారు’ అని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సిబ్బంది మృతదేహాలను వెలికితీశామని, మరో నలుగురు సైనికులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారని సదరు అధికారి చెప్పారు. కనిపించకుండా పోయిన ఆరుగురు సైనికులను గుర్తించడానికి రెస్క్యూ బృందాలు 24 గంటలూ పనిచేస్తున్నాయని తెలిపారు.