Indians : నేపాల్‌లో బుధవారం ఆకస్మిక వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో గల్లంతైన భారతీయుల వివరాలపై ఒక స్పష్టత వచ్చింది. మొత్తం 288 మంది భారతీయులు నేపాల్ వరదల్లో గల్లంతైనట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. బాధితులకు, వారి కుటుంబాలకు సాయం అందించేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ కీలక వివరాల్ని వెల్లడించారు.
గల్లంతైన భారతీయులను ఐదు ప్రధాగ విభాగాలుగా గుర్తించారు. నేపాల్‌లో చేపడుతున్న త్రిశూలి-1 పవర్ ప్రాజెక్టు వద్ద పని చేస్తున్న భారతీయ కార్మికులు అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్లిన భారతీయులు ఉన్నారు. గల్లంతైన 288 మందిలో 73 మంది త్రిశూలి పవర్ ప్రాజెక్టు కార్మికులు. 37 మంది సామ్రాట్ ట్రావెల్స్ ద్వారా తమిళనాడు నుంచి కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్లిన వారు. అలాగే, 49 మంది తమిళనాడులోని ఫ్లై ఎవరెస్ట్ ట్రావెల్స్ ద్వారా వెళ్లారు.
Special Control Room in MEA for Nepal Floods Situation
Details below ⬇️
🔗 https://t.co/hKxz6iIJTP pic.twitter.com/3dr6sT7tt0
— Randhir Jaiswal (@MEAIndia) August 27, 2026
32 మంది పశ్చిమ బెంగాల్ నుంచి వెళ్లారు. వారు వరదలు సంభవించిన రసువా జిల్లాలోని తిమురే ప్రాంతంలోనే గల్లంతయ్యారు. 33 మంది కేరళ నుంచి ఉన్నారు. అలాగే, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 61 మంది వరకు ఉన్నారు. నేపాల్ (ఖాట్మండ్)లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయ అధికారులు.. బాధితుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక అధికారులు, ఏజెన్సీలను సంప్రదిస్తూ, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరదల్లో 21 మంది భారతీయుల్ని అక్కడి అధికారులు రక్షించారు. 200 మంది వరకు టిబెట్ వద్ద చిక్కుకుపోయారు.
వారిని రక్షించే చర్యలు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు నేపాల్‌కు ఇండియా మానవతా సాయాన్ని అందిస్తోంది. ఈ పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి చేరేవరకు సాయం అందించేందుకు సిద్దమని భారత్ ప్రకటించింది. బాధితులు సాయం కోసం కంట్రోల్ రూంను సంప్రదించాలని సూచించింది.