న్యూఢిల్లీ: గోవా, ఉత్తరాఖండ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఏక విడత పోలింగ్ ఈ నెల 14న జరుగుతుంది. మిగతా మూడు రాష్ట్రాలతోపాటు మార్చి 10న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్నది. అయితే ఈసారి తృణమూల్ కాంగ్రెస్, ఆప్తోపాటు శివసేన పార్టీలు ఎన్నికల బరిలోకి దిగాయి. ఎన్సీపీతో పొత్తులో భాగంగా కొన్ని స్థానాల్లో శివసేన తొలిసారి రాష్ట్రం వెలుపల పోటీ చేస్తున్నది.
మరోవైపు 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్లో కూడా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్నది. అయితే ఈసారి ఆప్ కూడా ఎన్నికల బరిలో నిలిచింది. దీంతో త్రిముఖ పోటీ నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ తదితరులు బీజేపీ తరుఫున ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ ఇతర పార్టీ నేతలు ఆ పార్టీ కోసం ప్రచారం చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ తరుపున ఒంటరి పోరాటం సాగించారు.