బెంగళూరు: కుక్కర్ పేలిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. (cooker blast) వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులతోపాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ పేలుడులో ఉగ్రవాద కోణం ఉన్నదా అన్నది దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం జేపీ నగర్‌లోని ఉడిపి టిఫిన్ సెంటర్ సమీపంలో కుక్కర్ పేలింది. పేలుడు తీవ్రతకు ఆ ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడ్డాయి.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమీర్, మొహిసిన్ తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుక్కర్ పేలుడులో ఉగ్రవాద కోణాన్ని తోసిపుచ్చలేమని పోలీసులు తెలిపారు. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులను అక్కడకు పిలిపించారు. పేలుడు కారణాన్ని గుర్తించడంతోపాటు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో ఎన్ఐఏ సిబ్బంది, పోలీసులు నిమగ్నమయ్యారు.