చండీగఢ్: హర్యానా మాజీ మంత్రి కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ (Ajay Singh Yadav) రెండు రోజుల కిందట కాంగ్రెస్ పార్టీని వీడారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియా గాంధీ వైదొలగిన తర్వాత తన పట్ల నీచంగా వ్యవహరించారని ఆరోపించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యత్వంతోపాటు ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) విభాగం చైర్మన్ పదవికి కూడా గురువారం ఆయన రాజీనామా చేశారు.
కాగా, కాంగ్రెస్కు రాజీనామా చేసిన అజయ్ సింగ్ యాదవ్ శనివారం యూ టర్న్ తీసుకున్నారు. పుట్టుకతోనే తాను కాంగ్రెస్ వాదినని, తన చివరి శ్వాస వరకు అదే విధంగా ఉంటానని తెలిపారు. గతాన్ని మరిచి పార్టీ కోసం పని చేయాలని తన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే చిరంజీవి రావు తనకు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం వరుస ట్వీట్లు చేశారు.
38 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి తాను సేవ చేశానని, పార్టీలో తన సత్తా చాటానని అజయ్ సింగ్ యాదవ్ తెలిపారు. నెహ్రూ-గాంధీ వంశంతో తన కుటుంబానికి 70 ఏళ్లకు పైగా అనుబంధం ఉందని చెప్పారు. ‘నా నాయకులు దివంగత రాజీవ్ గాంధీ, సోనియా గాంధీతో కలిసి పనిచేశా. నా పట్ల వారి అభిమానాన్ని మరిచిపోలేను. నేను పుట్టుకతో కాంగ్రెస్ వాదిని. నా చివరి శ్వాస వరకు కాంగ్రెస్ వాదిగానే ఉంటా’ అని పేర్కొన్నారు.
మరోవైపు ఓబీసీ శాఖ కోసం తాను చేసిన కృషిని కాంగ్రెస్ హైకమాండ్ మెచ్చుకోలేదని, అందుకే కలత చెందినట్లు అజయ్ సింగ్ యాదవ్ తెలిపారు. కొన్ని పరుష పదాలు ఈ కఠినమైన నిర్ణయం తీసుకునేలా చేశాయని చెప్పారు. ‘నా నాయకురాలు, గురువు సోనియా గాంధీకి ప్రత్యేకంగా రుణపడి ఉంటా. ఆమె మనోభావాలను దెబ్బతీయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నా’ అని పేర్కొన్నారు.
అయితే ఇటీవల ముగిసిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రెవారీ నుంచి పోటీ చేసిన అజయ్ సింగ్ యాదవ్ కుమారుడు చిరంజీవి రావు ఓడిపోయారు. నాటి నుంచి పార్టీ పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు.