గాంధీనగర్: నకిలీ రక్తపోటు (బీపీ) మాత్రల విక్రయంపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఆహార, ఔషధ శాఖల అధికారులు దర్యాప్తు చేశారు. నకిలీ మందుల నెట్‌వర్క్‌ను ఛేదించారు. 1500 స్ట్రిప్‌ల నకిలీ రక్తపోటు మందులను అమ్మినట్లు గుర్తించారు. 1,200 స్ట్రిప్‌లను స్వాధీనం చేసుకున్నారు. (fake BP pills) గుజరాత్లో ఈ సంఘటన జరిగింది. భరూచ్‌కు చెందిన జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన ACG25007 బ్యాచ్ నంబర్ గల ‘నికార్డియా రిటార్డ్ 10 టాబ్లెట్’ నకిలీ మందులను అధికారులు గుర్తించారు. నకిలీ బీపీ టాబ్లెట్ల విక్రయంపై ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేపట్టారు. అహ్మదాబాద్‌తో పాటు సూరత్, భావ్‌నగర్, నడియాడ్, భుజ్‌లోని పలు మెడికల్ స్టోర్స్‌కు వీటిని సరఫరా చేసినట్లు తెలుసుకున్నారు.
కాగా, అహ్మదాబాద్‌లోని సుమారు 11 ఫార్మసీలకు ‘పార్శ్వ మెడికల్ స్టోర్’ ద్వారా ఈ నకిలీ బీపీ టాబ్లెట్స్ సరఫరా జరిగినట్లు దర్యాప్తులో బయటపడింది. దీంతో పార్శ్వ మెడికల్ స్టోర్ యజమాని దర్శిల్ సంఘ్వీతో పాటు, ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన దేవేంద్ర యాదవ్, ఉమంగ్ రస్తోగీలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ గుజరాత్‌కు నకిలీ మందులు సరఫరా చేయగా దర్శిల్ సంఘ్వీ 18 శాతం కమీషన్‌కు ఆకర్షితుడై మెడికల్ స్టోర్లకు వాటిని విక్రయించినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు నకిలీ బీపీ మాత్రలు తొలుత ఉత్తరాఖండ్ నుంచి లక్నోకు రవాణా జరిగిందని పోలీస్ అధికారి తెలిపారు. సుమారు 3,600 స్ట్రిప్స్లో 2,700 స్ట్రిప్స్లు అహ్మదాబాద్‌కు, మరో 900 మైసూరుకు దేవేంద్ర యాదవ్, ఉమంగ్ రస్తోగీ పంపినట్లు చెప్పారు. అహ్మదాబాద్‌కు పంపిన 2,700 స్ట్రిప్స్లో సుమారు 1,200 స్ట్రిప్స్ పోలీసులు స్వాధీనం చేసుకోగా, మిగిలిన 1,500 స్ట్రిప్స్ అమ్ముడయ్యయని వివరించారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నకిలీ మందుల తయారీదారులు, ప్యాకేజింగ్, సీలింగ్ జరిగిన కేంద్రాలను గుర్తించడానికి నాలుగు దర్యాప్తు బృందాలను పలు రాష్ట్రాలకు పంపినట్లు వెల్లడించారు.