తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 150కి చేరుకున్నది. జూలై 30వ తేదీన ముండక్కిలో భారీగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముండక్కిలో సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 91 మంది మిస్సింగ్ కాగా, 191 మంది ఆస్పత్రి పాలయ్యారు. 143 మందికి అటాప్సీ పూర్తి చేశారు. 20 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్‌ను మంగళవారం రాత్రి నిలిపివేశారు. ఇవాళ ఉదయం మళ్లీ ఆ ఆపరేషన్ మొదలుపెట్టారు.
48 మంది బాధితుల మృతదేహాలను గుర్తించారు. పోస్టుమార్టమ్ అయిన మృతదేహాలకు వాళ్ల బంధువులకు అప్పగించారు. సుమారు 78 మృతదేహాలను మెప్పాడి సోషల్ హెల్త్ సెంటర్లో పెట్టారు. మరో 32 మంది మృతదేహాలను నీలంబుర్ జిల్లా ఆస్పత్రిలో ఉంచారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.
ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఇవాళ ఉదయం మలప్పురంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. తన కాన్వాయ్‌తో వయనాడ్‌కు వెళ్తున్న మంత్రి కారు.. ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను తప్పించబోయి.. విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది. మంత్రి వీణకు స్వల్ప గాయాలయ్యాయి. మంజేరి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఆమెకు చికిత్స జరుగుతోంది. మంత్రికి ఎక్స్‌రే తీయాలని డాక్టర్లు అంచనా వేశారు.