ముంబై: ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కుమార్తె అనుమానాస్పదంగా మరణించింది. ఆమె ఇంటి సమీపంలోనే మృతదేహం లభించింది. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (MLA PA Daughter Found Dead) మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బారామతికి చెందిన శరద్ పవార్ వర్గం ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) అజిత్ దశావతారే కుమార్తె అయిన 14 ఏళ్ల అవని అనుమానాస్పదంగా మరణించింది. ఆదివారం ఉదయం ఆమె ఇంటి సమీపంలోని రోడ్డు పక్కన ఆ బాలిక మృతదేహం కనిపించింది.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం బారామతి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే రోహిత్ పవార్ హాస్పిటల్కు చేరుకుని ఆరా తీశారు. తన పీఏ కుమార్తె మృతిపై సమగ్ర విచారణ జరుపాలని పోలీసులను కోరారు.
మరోవైపు శనివారం రాత్రి ఒక విషయంలో తన తల్లితో చిన్నపాటి వాదన జరుగడంతో అవని కోపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. అయితే ఆదివారం ఉదయం ఇంటి సమీపంలో రోడ్డు పక్కన ఆ బాలిక మృతదేహం పడి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆమెది హత్యా? లేక ఆత్మహత్యా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.