డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో మంచుచరియలు(Uttarakhand avalanche) విరిగిపడ్డ ఘటనలో.. మరో 14 మంది కార్మికుల్ని రక్షించారు. ఇంకా 8 మంది కార్మికులు మంచుచరియల కింద ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 55 మంది కార్మికుల్లో 47 మందిని రక్షించారు. బద్రీనాథ్, మానా మధ్య ఉన్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ క్యాంపుపై మంచుచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి వరకే 33 మందిని కాపాడారు. వర్షం, మంచు తుఫాన్ వల్ల.. రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందికరంగా మారింది. శుక్రవారం రాత్రి ఆపరేషన్ నిలిపివేశారు. ఇవాళ ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఐటీబీపీ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టినట్లు జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసర్ ఎన్కే జోషీ తెలిపారు. మంచుచరియలు విరిగిపడ్డ ప్రదేశాన్ని ఇవాళ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పర్యటించే అవకాశాలు ఉన్నాయి.
శుక్రవారం ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న హిమపాతం సరిహద్దు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నది. ఈ క్రమంలో చమేలి జిల్లాలోని మన అనే సరిహద్దు గ్రామంలో చమోలి-బద్రీనాథ్ రహదారిపై ఏర్పాటు చేసిన శిబిరంపై పెద్దయెత్తున మంచు చరియలు విరుచుకు పడటంతో అక్కడ పనిచేస్తున్న 57 మంది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) కార్మికులు చిక్కుకుపోయారు. శుక్రవారం ఉదయం 7.15 గంటలకు ఇది చోటుచేసుకోగా, ఆ సమయానికి కార్మికులు ఎనిమిది కంటైనర్లు, ఒక షెడ్లో ఉన్నారు. దీంతో అధికారులు అప్రమత్తమై వారిని బయటకు తీసేందుకు సహాయ కార్యక్రమాలు చేపట్టారు.