న్యూఢిల్లీ: ప్రభుత్వ వసతి గృహంలో (Delhi shelter home) మిస్టరీ డెత్స్ వెలుగుచూశాయి. 20 రోజుల్లో 13 మంది పిల్లలు మరణించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 27 మంది చిన్నారుల మరణాలు నమోదయ్యాయి. మృతులంతా దివ్యాంగ పిల్లలు కావడం విశేషం. ఈ నేపథ్యంలో షెల్టర్ హోమ్ నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. రోహిణి ప్రాంతంలోని దివ్యాంగ పిల్లల ఆశాకిరణ్ వసతి గృహంలో గత 20 రోజుల్లో 13 మంది చిన్నారులు మరణించారు. జనవరి నుంచి 27 మరణాలు నమోదయ్యాయి. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) విచారణలో ఈ విషయం తేలింది. గత ఏడాది కంటే మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, పోస్ట్‌మార్టం నివేదికల తర్వాత మరణాలకు అసలు కారణం తెలుస్తుందని ఎస్డీఎం పేర్కొన్నారు.
కాగా, ఆశాకిరణ్ షెల్టర్ హోమ్ నిర్వహణలో నిర్లక్ష్యం, దారుణ పరిస్థితులపై విమర్శలు వెల్లువెత్తాయి. జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) దీనిపై స్పందించింది. నిజనిర్ధారణ బృందాన్ని ఆ షెల్టర్ హోమ్‌కు పంపింది. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆశాకిరణ్ షెల్టర్ హోమ్ ఆశను కోల్పోయిందని విమర్శించారు. పిల్లలు బాధలు పడుతున్నారని, చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం ఏమీ చేయడంలేదని ఆరోపించారు. మిస్టరీ మరణాలపై విచారణ కోసం ఒక బృందాన్ని అక్కడకు పంపినట్లు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న నైట్ షెల్టర్లపై కూడా ఎన్సీడబ్ల్యూ ఆడిట్ చేస్తుందని చెప్పారు.
మరోవైపు ప్రభుత్వ షెల్టర్ హోమ్‌లో పిల్లలు చనిపోవడంపై ఢిల్లీ మంత్రి అతిషి స్పందించారు. మృతుల సంఖ్యపై భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2024 జనవరి నుంచి ఈ షెల్టర్ హోమ్‌లో 14 మరణాలు నమోదైనట్లు తెలిపారు. మెజిస్టీరియల్ విచారణ చేపట్టాలని, 48 గంటల్లో నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి (ఏసీఎస్)ని ఆదేశించారు.
కాగా, ఢిల్లీ బీజేపీ నేతలు కూడా ఆశాకిరణ్ షెల్టర్ హోమ్‌ను సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. పిల్లలకు ఆహారం అందడం లేదని, మురికి నీరు సరఫరా చేస్తున్నారని, వైద్యసౌకర్యాలు లేవని బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు రేఖా గుప్తా ఆరోపించారు. సంబంధిత అధికారులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.