Lohit Express Accident | జమ్ము నుంచి అసోం రాజధాని గువాహటికి వెళ్లే లోహిత్ ఎక్స్ప్రెస్కు చెందిన పది బోగీలు విడిపోయాయి. ఈ సంగతి తెలిసిన రైల్వే అధికారులు, పోలీసులు సమన్వయంతో వ్యవహరించి, ఆ బోగీలను మళ్లీకలిపి పంపించిన ఘటన మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ లోని నార్త్ దినాపూర్ జిల్లాలోని దాల్ ఖోలా, బీహార్ లోని కిషాన్ గంజ్ మధ్య సూర్యకమల్ రైల్వే స్టేషన్ సమీపాన ఈ ఘటన జరిగింది.
ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు, రైల్వే స్టేషన్ పోలీసులు అప్రమత్తమై ఘటనాస్థలానికి చేరుకుని ఆ బోగీలను విజయవంతంగా తిరిగి కలిపిన తర్వాత లోహిత్ ఎక్స్ ప్రెస్ తన గమ్యస్థానానికి బయలుదేరి వెళ్లింది. దీనివల్ల రైలు 16 గంటలు ఆలస్యంగా జమ్ముతావికి చేరుకున్నది.
ఈ ఘటనను వీడియో తీసిన ఓ యూజర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘గువాహటి నుంచి జమ్ముతావికి బయలుదేరిన లోహిత్ ఎక్స్ ప్రెస్.. కతిహార్ రైల్వే డివిజన్ పరిధిలోని దాల్ కోట స్టేషన్ సమీపాన ప్రమాదానికి గురైంది. కప్లింగ్ ఫెయిల్యూర్ వల్ల రైలుబోగీలు విడి పోయాయి. ఇంజిన్ కొంత దూరం వెళ్లిపోయింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరుగలేదు. కానీ రైలు 16 గంటలు ఆలస్యమైంది` అని హిందీలో క్యాప్షన్ రాసుకొచ్చాడు.