ముంబై: ఒక కారు బైక్‌పైకి దూసుకెళ్లింది. దీంతో అదుపుతప్పిన అది వంతెన పైనుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి మరణించాడు. బైక్ వెనుక కూర్చొన్న వ్యక్తితోపాటు కారులోని ఇద్దరు గాయపడ్డారు. (Car Rams Bike Falls Off Bridge) మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో సింఘడ్ రోడ్డు ప్రాంతంలోని వాడ్గావ్ వంతెనపై మెర్సిడెస్ కారు వేగంగా ప్రయాణించింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిపైకి అది దూసుకెళ్లింది. దీంతో అదుపుతప్పిన ఆ కారు వంతెన పైనుంచి కిందపడింది. పూర్తిగా ధ్వంసమైంది.
కాగా, బైక్ నడుపుతున్న పింప్రి చించ్వాడ్ ప్రాంతానికి చెందిన కునాల్ హుషార్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించాడు. బైక్ వెనుక కూర్చొన్న వ్యక్తితోపాటు కారులో ప్రయాణించిన ఇద్దరు కూడా గాయపడ్డారు.
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు డ్రైవర్‌తోపాటు అందులో ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడో లేదో అన్నది తెలుసుకునేందుకు అతడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పోలీస్ అధికారి తెలిపారు.