న్యూఢిల్లీ: సింధు జలాల ఒప్పందంపై ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసిన ఆర్బిట్రేషన్ కోర్టు ఇచ్చిన తీర్పును విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ(ఎంఈఏ) సోమవారం నిర్దంద్వంగా తిరస్కరించింది. పాక్‌కు నీటిని విడుదల చేయాలని ఈ కోర్టు తీర్పునిచ్చింది. అయితే అది చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థగా విదేశాంగ శాఖ అభివర్ణించింది. పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న జల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం అమల్లోనే ఉంటుందని ఎంఈఏ ఒక ప్రకటనలో తెలిపింది.
ఒప్పందంలోని నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘిస్తూ ప్రపంచ బ్యాంకు కోర్టు అని చెబుతున్న ఈ సంస్థను ఏర్పాటు చేసింది. చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ గతంలో చేసిన అన్ని ప్రకటనలను భారత్ ఎలాగైతే తిరస్కరించిందో అలాగే ఇప్పటి తీర్పును కూడా నిర్దంద్వంగా తిరస్కరిస్తున్నది అని ఎంఈఏ పేర్కొంది. మధ్యవర్తిత్వ న్యాయస్థానం అని చెప్పుకుంటున్న ఈ కోర్టు ఉనికిని భారత్ ఎన్నడూ గుర్తించలేదు.