– ఐసీడీఎస్ సూపర్వైజర్ వినోదకుమారి
నీలగిరి, ఏప్రిల్ 20 : చిన్నారులు, గర్భిణులు, బాలింతలో రక్తహీనతను తగ్గించేందుకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకునేలా ప్రోత్సాహించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ వినోదకుమారి అన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలోని చైతన్యపురి కాలనీ సెక్టార్ పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని రైతు బజార్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించి, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చాలామంది మహిళలు రక్త హీనతతో బాధపడుతున్నారని దీనివల్ల చిన్నారులు బలహీనంగా అనారోగ్యంతో జన్మించి చనిపోతున్నారని తెలిపారు. దీన్ని అదిగమించేందుకు ప్రభుత్వం పోషణ్ అభియాన్ పేరుతో వెయ్యి రోజుల కార్యక్రమాన్ని తీసుకు వచ్చిందన్నారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వార బాలింతలు, చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నందున సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. మహిళల్లో రక్తహీనత కారణంగా చిన్నారులు పౌష్టికాహారం లోపాన్ని అదిగమించేందుకు గర్భిణులు, బాలింతలు ఏ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ రకమైన భోజనం తీసుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పుట్ట సునీత, అమనగంటి సముద్రమ్మ, ఉమామహేశ్వరి, రజియాసుల్తానా, అనంతలక్ష్మి, ఫర్జానా, స్వప్న, సరిత, అరుణజ్యోతి, షహనాజ్, జరీనా, జంపాల దివ్య, అతిత, రేణుక, అలివేలు, నాగమ్మ పాల్గొన్నారు.

‘పౌష్టికాహారం తీసుకునేలా ప్రోత్సహించాలి’