మిర్యాలగూడ, జూలై 26: ‘రూ. కోట్లు వెచ్చించి సుమారు 59 ఎకరాల భూమిని కొనుగోలు చేశాం. నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నం. కానీ అంతకు ముందు ఆ భూమికి అడ్వాన్స్ ఇచ్చి గడువు లోగా పూర్తిగా సొమ్ము ఇవ్వకుండా, రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉన్న కొందరు వ్యక్తులు.. తాము కొనుగోలు చేసిన భూమిపైకి తమను రానివ్వకుండా మూడేండ్లుగా ముప్పుతిప్పలు పెడుతున్నారని మండలంలోని జప్తి వీరప్పగూడెం గ్రామానికి చెందిన వేముల రామారావు పద్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్యాలగూడలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మిర్యాలగూడ మండలంలోని జప్తీ వీరప్పగూడెం గ్రామ రెవెన్యూ శివారులోని 58 ఎకరాల 36 గుంటల భూమిని ఓ సంస్థ నుంచి తాము మూడేండ్ల క్రితం కొనుగోలు చేసినట్లు తెలిపారు.
ఎన్ఆర్ఐ అయినా తమ కుమారుడు వేముల త్రినాథ్, కోడలు సుచిత పేరుపై 45 ఎకరాలు.. మిగతా 13 ఎకరాల 36 గుంటల భూమిని తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నామన్నారు. అయితే తాము ఆ భూమిని కొనుగోలు చేయకముందే సదరు సంస్థతో ఆ భూమి కొనుగోలు నిమిత్తం అడ్వాన్స్ చెల్లించిన కొందరు వ్యక్తులు రాసుకున్న ఒప్పంద పత్రం మేరకు పూర్తి అమౌంట్ గడువు లోపు చెల్లించలేదన్నారు. దీంతో సదరు సంస్థ తిరిగి తమకు ఆ భూమిని విక్రయించిందన్నారు. అయితే అడ్వాన్స్ చెల్లించిన వ్యక్తులు భూమిని కొనుగోలు చేసిన తమను తమ భూమిలోకి రానివ్వకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిబంధనల ప్రకారమే భూమి హకులు పొంది ఉన్నప్పటికీ సదరు వ్యక్తులు వృద్ధులమైన తమను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గుర్తిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కొనుగోలు చేసిన భూమిలో తాము కంటైనర్ ఏర్పాటు చేయగా దానిని కొందరు తగలబెట్టి ఆర్థికంగా నష్టపరిచినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై తాము ఎకడికి వెళ్లినా న్యాయం జరగడం లేదన్నారు. అంతేగాక సదరు వ్యక్తుల నుంచి తమకు ప్రాణహాని ఉన్నట్లు వేముల రామారావు పద్మ దంపతులు పేర్కొన్నారు. ఈ విషయమై మిర్యాలగూడ రూరల్ ఎస్సై లక్ష్మయ్యను వివరణ కోరగా సదరు భూమి వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలిపారు. కోర్టు గైడ్లైన్స్ ప్రకారమే తాము నడుచుకుంటున్నట్లు తెలిపారు.