తగ్గిన ఎమ్మెల్సి పోలింగ్
వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఉపఎన్నికలో పోలింగ్ శాతం తగ్గింది. 2021 మార్చిలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఉప ఎన్నికలో 3.97శాతం తగ్గింది.
- 2021తో పోలిస్తే 3.97శాతం తగ్గుదల
- అత్యధికంగా యాదాద్రిలో 78.59శాతం
- అత్యల్పంగా ఖమ్మంలో 67.62శాతం
- నల్లగొండలోని దుప్పలపల్లి స్ట్రాంగ్ రూమ్స్‌లో బ్యాలెట్ బాక్సులు భద్రం
- మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు
- వచ్చే నెల 5నుంచి ఓట్ల లెక్కింపు
- పోలింగ్ సరళిపై అంచనాల్లో అభ్యర్థులు
- తుది పోలింగ్ 72.44 శాతం
నల్లగొండ ప్రతినిధి, మే28(నమస్తే తెలంగాణ) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఉపఎన్నికలో పోలింగ్ శాతం తగ్గింది. 2021 మార్చిలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఉప ఎన్నికలో 3.97శాతం తగ్గింది. పోలింగ్‌కు సాయంత్రం 4గంటల వరకే గడువు ఉన్నా… అప్పటికే క్యూలైన్లలో ఉన్న ఓటర్లంతా ఓటు వేసే సరికి కొన్నిచోట్ల సాయంత్రం ఏడు గంటలు కూడా దాటింది. దాంతో 12 జిల్లాల నుంచి తుది ఓటింగ్ వివరాలు రావడానికి సోమవారం అర్ధరాత్రి దాటింది. మంగళవారం ఉదయం ఫైనల్ పోలింగ్ వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ హరిచందన వెల్లడించారు. మొత్తం 72.44శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 78.59శాతం కాగా అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 67.62శాతం నమోదైంది. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని జిల్లా కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్‌లను భారీ బందోబస్తు నడుమ నల్లగొండ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లోని స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించారు. అక్కడ 24గంటల పాటు సీసీ టీవీ కెమెరా పర్యవేక్షణలో మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ నెల 5న ఓట్ల లెక్కింపు మొదలుకానుండగా ప్రధాన అభ్యర్థులంతా పోలింగ్ సరళిపై లెక్కల్లో మునిగి తేలుతున్నారు. 2021 ఎన్నికలతో పోలిస్తే 41వేలపై చిలుకు ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నా సరే ప్రస్తుత ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గింది. అప్పుడు మొత్తం 5,05,565 మంది ఓటర్లు ఉండగా 3,86,320 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 76.41శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం మొత్తం 4,63,839 మంది ఓటర్లు ఉండగా 3,36,005 మంది ఓటర్లు ఓటేయగా 72.44శాతం పోలింగ్ నమోదైంది. మూడేండ్ల కిందట జరిగిన ఎన్నికతో పోలిస్తే ప్రస్తుతం పోలింగ్ 3.97శాతం తగ్గింది. ఉప ఎన్నికల సమయంలో ఓట్లు నమోదు చేయించుకోవడంలో చూపిన ఉత్సాహం పోలింగ్ రోజున చూపకలేకపోయారు.
యాదాద్రి జిల్లాలో అత్యధికం
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎప్పటిలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. ఇక్కడ 78.59 శాతం ఓటింగ్ జరుగడం విశేషం. ఇది కిందటి సారి కంటే నియోజకవర్గం సగటు ఓటింగ్‌ను కూడా క్రాస్ చేసింది. ఇక అత్యల్పంగా ఖమ్మంలో 67.62శాతమే పోలింగ్ జరిగింది. రెండో స్థానంలో జనగామలో 76.34శాతం, ఆ తర్వాత వరుసగా సిద్దిపేటలో 76.13శాతం, ములుగులో 74.58శాతం, జయశంకర్భూపాలపల్లిలో 73.62శాతం, నల్లగొండలో 73.29 శాతం, సూర్యాపేటలో 73.15శాతం, వరంగల్‌లో 72.68శాతం, హన్మకొండలో 72.45శాతం, మహబూబాబాద్‌లో 72.15శాతం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 69.95శాతం ఓటింగ్ నమోదైంది.
వచ్చే నెల 5 నుంచి కౌంటింగ్
వచ్చే నెల 4వ తేదీన పార్లమెంట్ ఎన్నికల కౌటింగ్ కూడా దుప్పలపల్లి గోదాములోనే జరుగనుంది. మర్నాడు 5వ తేదీన అక్కడే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చేపట్టనున్నారు. ఉదయం 8గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది.
ముందుగా బ్యాలెట్ బాక్స్‌లను ఓపెన్ చేసి బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున ఒక బండిల్‌గా రూపొందిస్తారు. ఇది పూర్తయ్యాక తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. ఇదే సమయంలో చెల్లని ఓట్ల లెక్క తేలుస్తారు. దీని అనంతరం గెలుపు కోటా అంటే చెల్లిన ఓట్లలో 50శాతం ప్లస్ ఒకటిని ఖరారు చేస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు కోటా ఎవరికీ రాకపోతే దాన్ని చేరుకునే వరకు ఎలిమినేషన్ పద్ధతిలో కౌంటింగ్‌ను పూర్తి చేస్తారు. మొత్తం కౌంటింగ్ పూర్తయ్యే సరికి కనీసం 48 గంటలు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. అప్పటివరకు ప్రధాన అభ్యర్థులంతా పోలింగ్ సరళిని అంచనా వేస్తూ గెలుపోటములపై సమీక్షల్లో మునిగి తేలాల్సిందే.
స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రత
సోమవారం సాయంత్రం 12 జిల్లాల పరిధిలో పోలింగ్ ముగిసాక బ్యాలెట్ బాక్స్‌లను ముందుగా ఆయా జిల్లా కేంద్రాల్లోని రిసెప్షన్ కేంద్రాలకు తరలించారు. అక్కడికి అన్ని చేరాక భారీ బందోబస్తు నడుమ రూట్ల వారీగా మంగళవారం తెల్లవారుజాము వరకు నల్లగొండ శివారులోని అనిశెట్టి దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములకు చేరవేశారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థతోపాటు 24 గంటల పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతోపాటు సీఆర్పీఎఫ్ సిబ్బందితో నిరంతర పహారా కొనసాగేలా చర్యలు చేపట్టారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక
ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
MLA Manik Rao | చెరుకు రైతుకు రూ.4,500 మద్దతు ధర ఇవ్వాలి: ఎమ్మెల్యే మాణిక్ రావు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

