కోదాడ, ఆగస్టు 02 : కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే ఎన్.పద్మావతి రెడ్డి తెలిపారు. శనివారం కోదాడ ప్రభుత్వ దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన 315 కేవీ సామర్థ్యం కలిగిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. కోదాడ నియోజకవర్గ ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 30 పడకల దవాఖానను మంజూరు చేశారని.. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు దాన్ని 100 పడకల దవాఖానగా అప్గ్రేడ్ చేసి నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం దవాఖాన ఆవరణలోని ముత్యాలమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.
డీసీహెచ్ఎస్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కోదాడ ప్రభుత్వ దవాఖానాలో ప్రసూతి వైద్య సేవలు అందించేందుకు వారంలోగా మరో ప్రసూతి వైద్యురాలిని భర్తీ చేస్తామని తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినందున త్వరలో రూ.3.66 కోట్ల విలువ కలిగిన సిటీ స్కానింగ్ సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఇక్కడ డయాలసిస్ సెంటర్ సజావుగా నడుస్తుందని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ కేంద్రం ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు.
కోదాడ ప్రభుత్వ దవాఖానలో మౌలిక వసతులతో పాటు మెరుగైన సేవలు అందించినందుకు, నిర్వహణ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాయకల్ప అవార్డుతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతి లభించిందని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ తెలిపారు. జాతీయ రేబిస్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా త్వరలో 24 గంటలు సేవలు అందించేందుకు ఒక వైద్యుడు, ముగ్గురు స్టాఫ్ నర్సులు విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇది తొలి సెంటర్ కాబోతుందన్నారు. దీంతో పాటు పుట్టుకతో తక్కువ బరువు ఉన్న పిల్లల సంరక్షణకు నియోనేటల్ రిహాబిలిటేషన్ సెంటర్ కూడా మంజూరు అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీఓ సూర్యనారాయణ, విద్యుత్ ఏడీ వెంకన్న, టౌన్ ఏఈ నరసింహ నాయక్, లైన్మెన్ సందీప్, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, కే ఎల్ ఎన్ ప్రసాద్, కమిషనర్ రమాదేవి అభిరామ్, వైష్ణవి, నాయకులు సామినేని ప్రమీల, కందుల కోటేశ్వరరావు, ఈదుల కృష్ణయ్య, శ్రీనివాసరావు, డాక్టర్ బ్రహ్మం ముస్తఫా పాల్గొన్నారు.