హాలియా, ఏప్రిల్ 28 : నెల్లికల్లు లిఫ్ట్ పనులు ప్రస్తుతం చకచకా సాగుతున్నాయి. ఏడాదిలో పూర్తి చేసి రైతాంగానికి నీరందించేందు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. తిరుమలగిరి సాగర్ మండలంలోని 24,886ఎకరాల బీడు భూములకు సాగు నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రూ.692 కోట్ల వ్యయంతో నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం ఈ పనులు చకచకా సాగుతున్నాయి. గతేడాది కృష్ణా నదికి వరద రాకతో పనులకు ఆటంకం కల్గింది. గత అనుభవాల దృష్ట్యా కాంట్రాక్టర్ భవిష్యత్‌లో కృష్ణానదికి వరద వచ్చినా పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు గుట్టల మధ్య యూ ఆకారంలో మట్టిబండ్ నిర్మించారు. దీంతో పనుల్లో వేగం పెరిగింది.
నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం
నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణం ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంతో ఈ కోరిక నెరవేరలేదు. దీంతో సాగర్ జలాశయానికి ఎగువన కూతవేటు దూరంలో ఉన్న కృష్ణపట్టె ప్రాంతం 50ఏండ్లుగా సాగు నీటికి నోచుకోలేదు. నెల్లికల్లు లిఫ్ట్ పేరు చెప్పి కాంగ్రెస్ నాయకులు 20ఏండ్ల పాటు ఓట్లు దండుకోవడం తప్ప నిర్మించలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లిఫ్ట్ నిర్మాణానికి అటవీ శాఖ అనుమతి తేలేకపోయారు. దీన్ని బట్టి కాంగ్రెస్ నాయకులకు నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణంపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది.
బీఆర్ఎస్తోనే నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణం
30ఏండ్ల నాటి కృష్టపట్టె ప్రాంత రైతుల కళను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చింది. 2018ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే నెల్లికల్లు లిఫ్ట్ నిర్మిస్తామని హామీనిచ్చింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే 2018 శాసనసభ ఎన్నికలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈ ప్రాంత రైతుల మనోభిప్రాయాల మేరకు 2020సంవత్సరంలో నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కరోన రావడంతో ఏడాది పాటు పనులు వాయిదా పడ్డాయి. అనంతరం 2021లో సీఎం కేసీఆర్ స్వయంగా ఇక్కడికొచ్చి లిఫ్ట్ నిర్మాణానికి పునాది రాయి వేశారు. గతేడాది వచ్చిన వరదకు పనులు ఆలస్యమయ్యాయి. గతేడాది నల్లగొండకు వచ్చిన సీఎం కేసీఆర్ నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణంపై అధికారులతో సమీక్షించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. కృష్ణానదికి వరద తగ్గాక పనులు ఊపందుకున్నాయి. సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇటీవల నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనులు పరిశీలించారు. పనుల పురోభివృద్ధిని నీటి పారుదల అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు ఏడాదిలో ఒకవైపు లిఫ్ట్ నిర్మాణంతో పాటు మరో వైపు పంట కాల్వల నిర్మించాలని అధికారులకు సూచించారు.
వరద నీటితో పనుల్లో ఆలస్యం
వరద నీరు, నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణ ప్రతిపాదనలో మార్పు , వరద నీటితో పనులు ఆలస్యమయ్యాయి. 2021 ఫిబ్రవరి నెలలో సీఎం కేసీఆర్ నెల్లికల్లు లిఫ్ట్ శంకుస్థాపన సందర్భంగా రూ.72.16కోట్ల వ్యయంతో 4,175 ఎకరాలకు భూమికి సాగునీరు ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నెల్లికల్లు లిఫ్ట్ శంకస్థాపన అనంతరం లిఫ్ట్ సామర్థ్యం, నిర్మాణ వ్యయం పెంచితే కృష్ణపట్టె ప్రాంతంతో పాటు తిరుమలగిరి సాగర్ మండలమంతా సాగవుతుందని ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్, విశ్రాంత ఇంజనీర్ల బృందం సీఎం కేసీఆర్‌కు వివరించారు. స్పందించిన ఆయన నెల్లికల్లు లిఫ్ట్‌తో బీడు భూములన్నింటికీ సాగు నీరు అందేలా లిఫ్ట్ నిర్మాణ సామర్థ్యం, సాగు విస్తీర్ణం పెంచి తిరిగి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నీటి పారుదల శాఖాధికారులను ఆదేశించడంతో పనులు కాస్త ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణ వ్యయాన్ని రూ.692కోట్లకు పెంచి 24,886ఎకరాలకు సాగు నీరు అందేలా ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం లిఫ్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అన్ని సవ్యంగా జరిగితే ఏడాదిలో లిఫ్ట్ నిర్మాణ పనులు పూర్తికానున్నాయి.
తెల్లముఖం వేసిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు
నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణంపై సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు పలు ఆరోపణలు చేశారు. ఉప ఎన్నికల కోసమే బీఆర్ఎస్ నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిందని చెప్పడంతో పాటు పదేండ్లు దీని నిర్మాణం చేపట్టి పూర్తి చేయరని శాపనార్థాలు పెట్టారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకుందని ఏడాదిన్నలో పనుల పూర్తికి కృషి చేస్తానని హామీనిచ్చారు. నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణం పూర్తి చేయకపోతే తాను రాజీనామా చేస్తానని అందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు సిద్ధమా అని సవాల్ విసిరారు. మంత్రి సవాల్ విసిరినట్టుగానే ప్రభుత్వం నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణ పనులను వేగంగా చేపట్టడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు తెల్లముఖం వేశారు.
లిఫ్ట్ నిర్మాణంపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యేక శ్రద్ధ
నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణంపై ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. దీనిపై ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పలమార్లు శాసన సభ, శాసనమండలి సమావేశాల్లో ప్రస్తావించారు. నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణ విషయమై ఏడాది కాలంలోనే పలుమార్లు లిఫ్ట్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి ఎప్పటికప్పుడు అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు. లిఫ్ట్ నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోతున్నారు.
త్వరగా పనుల పూర్తికి కృషి
నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేందుకు కృషి చేస్తా. లిఫ్ట్ నిర్మాణం మా నాన్న నర్సింహయ్య చిరకాల కోరిక. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నెల్లికల్లు లిఫ్ట్ నిర్మాణ పనులు చేపట్టాం. సాగు విస్తీర్ణాన్ని 4,175ఎకరాల నుంచి 24,886ఎకరాలకు విస్తరించారు. లిఫ్ట్ రీడిజైన్ వల్ల పనులు ఆలస్యమైంది. పనులు త్వరగా పూర్తి చేసి బీడు భూములకు సాగు నీరందించేందుకు కృషి చేస్తా.
– ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్