– లేనిపక్షంలో గవర్నర్ గ జోక్యం చేసుకుని ఆయనను బర్తరఫ్ చేయాలి
– సొంత జిల్లాకు దోఖా చేసి ఖమ్మం జిల్లాకు నీరు తరలింపు
– పోతిరెడ్డిపాడుకు నీరు తరలిస్తుంటే నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వం
– ప్రాజెక్టు డెడ్ స్టోరేజీలోనూ నీరిచ్చిన ఘనత కేసీఆర్ దే
– కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, ఆగస్టు 25 : ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు సాగునీరందక వేసిన వరి పంటలు ఎండిపోతుండటంతో పాటు భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్ల నుండి నీళ్లు పోయక ఇబ్బందులు పడుతుంటే సాగునీరు అందించలేని అసమర్థ, అవినీతి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎండిపోతున్న పంటలకు సాగునీరు అందించాలని కోరుతూ కోదాడ నీటి పారుదల శాఖ కార్యాలయంలో రైతులతో కలిసి కార్యనిర్వాక ఇంజనీర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. గత జూన్ నెలలో సాగర్ ప్రాజెక్టు నుండి తాగునీటి కోసం చెరువులను నింపుకునేందుకు ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ నుండి నీళ్లు తరలించకపోతుంటే మంత్రి ఉత్తమ్ ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు.
ఒకవైపు సాగర్ ప్రాజెక్టుకు గండికొట్టే విధంగా నదీ జలాల వాటా నిబంధనలను తుంగలో తొక్కి పోతిరెడ్డిపాడు నుంచి 10 టీఎంసీల నీటిని తీసుకెళ్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులో నీరు రాకపోవడానికి ఇది ప్రధాన కారణమన్నారు. ఒకవైపు నీళ్లు లేక వర్షాభావ పరిస్థితుల్లో రైతులు గగ్గోలు పెడుతుంటే యాగాల పేరుతో మంత్రివర్గం కాలక్షేపం చేస్తుందని విమర్శించారు. సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ లోను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీరు అందించిన మహనీయుడని కొనియాడారు. ఎస్ ఎల్ బి సి పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని చెప్పి కమీషన్ల కోసం పనులు ప్రారంభించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. వీరి అవగాహన లేమి వల్ల 8 మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారని, చివరకు మృతదేహాలను కూడా బయటికి తీసుకురాలేని దుస్థితి వీరి అసమర్ధతకు సాక్షిభూతం అన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యామ్‌లలో తెలంగాణకు ఉన్న హక్కులను కేఆర్ఎంబీకి అప్పజెప్పి తెలంగాణ రైతాంగానికి, ఉమ్మడి జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం చేసిన చరిత్ర మంత్రిదన్నారు.
ఈ విషయంలో అవగాహన లేకుండా వ్యవహరిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో గవర్నర్ జోక్యం చేసుకుని ఆయనను బర్తరఫ్ చేయాలని కోరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్న పౌర సరఫరాల శాఖ అవినీతిమయమైందని రాష్ట్ర వ్యాప్తంగా మిల్లులలో ధాన్యం మాయమై అవినీతిమయమైందని, గవర్నర్ జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరపాలని కోరారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రైతాంగానికి, ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని గుర్తించి తెలంగాణ రైతాంగానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నాలో పార్టీ మండల బాధ్యులు నల్ల భూపాల్ రెడ్డి, జానకి రామాచారి, కూరాకుల కృష్ణమూర్తి, అనంతుల ఆంజనేయులు, ఏలూరు వెంకటేశ్వరరావు, మద్ది మధుసూదన్ రెడ్డి, ఉపేంద్ర గౌడ్, తాలూరి శ్రీనివాసరావు, ప్రదీప్, పిట్టల భాగ్యమ్మ, నయీమ్, శ్రీకాంత్, కిరణ్ కుమార్, రైతులు పాల్గొన్నారు.

‘సాగు నీరందించలేని మంత్రి ఉత్తమ్ రాజీనామా చేయాలి’