మేళ్లచెర్వు, ఫిబ్రవరి 8 : మార్చి 1 నుంచి 5 వరకు జరిగే మేళ్లచెర్వులోని స్వయంభూ శంభు లింగేశ్వరస్వామి ఆలయ జాతరకు ఏర్పాట్లు చేయాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచించారు.ఆలయ ఆవరణలో మంగళవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలో భక్తులను అప్రమత్తం చేయాలని, మాస్క్‌లు ఉపయోగించేలా, భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలని అన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వసతులు కల్పించాలని, తాగునీరు, వైద్యం, పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని తెలిపారు. నాలుగేండ్లుగా ఆలయంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, కోనేరు ఏర్పాటుకు ప్రభుత్వానికి విన్నవించామని చెప్పారు. రోడ్లపై గుంతలు ఉంటే పూడ్చివేయాలని అన్నారు. జాతరకు ప్రభుత్వం నిధులు కేటాయించేలా ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతకు ముందు ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమావేశంలో హుజూర్నగర్ ఆర్డీఓ వెంకారెడ్డి, తాసీల్దార్ దామోదర్‌రావు, స్థానిక సర్పంచ్ పందిళ్లపల్లి శంకర్‌రెడ్డి, ఈఓ గుజ్జుల కొండారెడ్డి, ప్రజాప్రతినిధులు, సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.