హుజూర్నగర్, అక్టోబర్ 8 : ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హుజూర్నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుధ్యం, తాగునీటి సమస్యలు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా 4,500 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. డిజిటల్ ఫ్యామిలీ కార్డుల వివరాల నమోదు, రామస్వామిగుట్ట వద్ద నిర్మిస్తున్న సింగిల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను పురోగతిని పరిశీలించారు. పనులు వేగంవంతం చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ యాకుబ్ పాష, వైస్ చైర్మన్ కోతి సంపత్‌రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ పాల్గొన్నారు.
పాలకవీడులో ప్రభుత్వ కార్యాలయాల తనిఖీ
పాలకవీడులోని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య ఉప కేంద్రానికి వెళ్లి ఓపీ రిజిస్టర్‌ను పరిశీలించారు. వైద్య సేవలు, ఫార్మసీ స్టోర్, ఏఎన్సీ సర్వే గురించి తెలుసుకొన్నారు. హెల్త్ సబ్ సెంటర్‌ను ఆరోగ్య కేంద్రంగా మార్చిన నేపథ్యంలో త్వరలో పూర్తి స్ధాయిలో డాక్టర్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. తాసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, గ్రామాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దసరా సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యంపై నివేదికను అందించాలని ఎంఈఓను ఆదేశించారు. గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లి అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో హుజూర్నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, మండల ప్రత్యేక అధికారి శంకర్, ఎంపీడీఓ లక్ష్మి, ఇన్చార్జి తాసీల్దార్ కమలాకర్, ఎంఈఓ కాటయ్య, ఏఓ కళ్యాణచక్రవర్తి పాల్గొన్నారు.