జాబ్ ఏదైనా
ప్రిపరేషన్ అక్కడే. ప్రిపేర్ అవ్వండి.. జాబ్ కొట్టండి అంటూ నిరుద్యోగ యువతకు ప్రోత్సాహమందిస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఆసరాగా నిలుస్తున్నది లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేయడంతో అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. చిన్న చిన్న ఇళ్లల్లో, ఇరుకు గదుల్లో ప్రిపేర్ అవ్వలేక, ఇబ్బందులు పడుతున్న అభ్యర్థులకు నకిరేకల్‌కు చెందిన వాసవి సేవా సమితి, లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత స్టడీ హాల్‌ను 7నెలల కింద ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి.
నకిరేకల్ పట్టణంలోని వాసవి డిగ్రీ కళాశాలలో గతంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహించేవారు. అయితే.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బస్టాండ్ వెనుక భాగంలోకి మార్చడంతో వాసవీ డిగ్రీ కాలేజీ భవనాలు నిరూపయోగంగా ఉన్నాయి. లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ వారు నిరుద్యోగులకు ఉచిత స్టడీ హాల్ కావాలని వాసవి సేవా సమితిని కోరారు. గ్రామీణ నిరుద్యోగ యువతతోపాటు పట్టణంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం అందులో ఉచిత స్టడీ హాళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఉచిత స్టడీ హాల్స్‌ను ఏర్పాటు చేశారు. లైబ్రరీలను తలపించే విధంగా ఫ్యాన్లు, టేబుళ్లు, స్టడీ చైర్లు ఏర్పాటు చేశారు.
ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నిత్యం శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నారు. దాతల సహకారంతో పోటీ పరీక్షలకు ఉపయోగపడే కొన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచారు. నకిరేకల్ మండలంలోని నోముల, తాటికల్, చందుపట్ల, నెల్లిబండ, పాలెం, చందంపల్లి తదితర గ్రామాలతోపాటు నకిరేకల్ పట్టణంలోని పలు కాలనీల్లోని అభ్యర్థులు చదువుకునేందుకు ఇక్కడకు వస్తున్నారు. ఉదయం 9నుంచి రాత్రి 7గంటల వరకు ఈ స్టడీ హాల్స్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. కళాశాల ప్రాంగణం పెద్ద పెద్ద వృక్షాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దీంతో గ్రూప్స్, పీసీ, స్టాఫ్ సెలక్షన్ కమిటీ, జూనియర్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్, టెట్, డీఎస్సీ ఉద్యోగాలకు ఎక్కువగా ప్రిపేరవుతున్న వారు ఈ స్టడీ హాల్‌కు వస్తున్నారని లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.
ఆహ్లాదరకంగా ఉన్నది
నేను గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా. మహిళలకు ప్రత్యేక ఉచిత స్టడీ హాల్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. కళాశాల ప్రాంగణం చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇంటి దగ్గర చిన్న పిల్లల అల్లర్లు, మోటార్ వెహికిల్ శబ్ధాలతో ఇబ్బందులు పడుతున్నా. మా ఫ్రెండ్ గతంలో ఇక్కడ ప్రిపేర్ అయ్యేది. తనకు జాబ్ వచ్చిన తరువాత నాక్కూడా ఈ స్టడీ హాల్లో ప్రిపేర్ అవ్వాలని అనిపించింది. ఉదయం 10 గంటలకు వచ్చి మధ్యాహ్నం 2గంటల వరకు చదువుకొని వెళ్తా. లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మరువలేనిది.
– జి.నాగరాణి, నకిరేకల్
కచ్చితంగా జాబ్ కొడతా
లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మర్చిపోలేనిది. ఉచిత స్టడీ హాల్ ఏర్పాటు చేసి అందులో మా లాంటి నిరుపేదలకు చోటు కల్పించిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. మాది కేతేపల్లి మండలం ఇనుపాముల. చిన్న ఇళ్లు. ఇరుకు గదిలో చదువుకోలేని పరిస్థితుల్లో ఉచిత స్టడీ హాల్ గురించి తెలుసుకున్నా. 6నెలల నుంచి ఇక్కడే టెట్‌కు, గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నా. ఈ సారి కచ్చితంగా జాబ్ కొడతా. ఈ వాసవీ కళాశాల ఉస్మానియా యూనివర్శిటీని తలపిస్తున్నది.
– ఆకారపు సతీశ్, ఇనుపాముల, కేతేపల్లి మండలం
నిరుపేదలకు సహాయం అందించడమే లక్ష్యం
వాసవి సేవా సమితి, లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 214 రోజులుగా ఉచిత స్టడీ హాల్ నిర్వహిస్తున్నాం. మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఉచిత స్టడీ హాల్స్ ఏర్పాటు చేశాం. ఉదయం 9నుంచి రాత్రి 7గంటల వరకు స్టడీ హాల్స్ నిర్వహిస్తున్నాం. అభ్యర్థులకు మంచినీళ్లు, ఫ్యాన్లు, లైటింగ్, పాత పుస్తకాలు అందిస్తున్నాం. ఫౌండేషన్ వాట్సాప్ గ్రూప్ ద్వారా విద్య, ఉద్యోగ నోటిఫికేషన్ల సమాచారాన్ని అందిస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 500 మందికి పైగా ఈ స్టడీ హాల్‌ను వినియోగించుకున్నారు. నిరుపేద అభ్యర్థులకు సహాయం అందించడమే లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ లక్ష్యం.
– బ్రహ్మదేవర నరేశ్, లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ నిర్వాహకుడు