కట్టంగూర్, ఆగస్టు 22 : అయ్యప్ప భక్తి ప్రచారం, ధార్మిక సేవల్లో విశేష కృషి చేసిన కట్టంగూర్ సాయి మణికంఠ ఆలయ గురుస్వామి వంగూరు లక్ష్మయ్య (పూల గురుస్వామి)కు గురు పురస్కారం–2026 లభించింది. మహాశాస్త్ర సేవా సంఘం హైదరాబాద్ ఆధ్వర్యంలో శనివారం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో నిర్వహించిన కార్యక్రమంలో శబరిమల అయ్యప్ప స్వామి వంశస్తుడు సురేష్ శర్మ ఈ పురస్కారాన్ని అందజేశారు. లక్ష్మయ్యతో పాటు ఆయన సతీమణి లక్ష్మిని జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. అయ్యప్ప భక్తులకు ధార్మిక విలువలు బోధిస్తూ, కట్టంగూర్‌లో అయ్యప్ప ఆలయ నిర్మాణానికి కృషి చేసినందుకు ఈ పురస్కారం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. పలువురు గురుస్వాములు, అయ్యప్ప భక్తులు పాల్గొని దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో హరిహరపుత్ర సేవా సమితి ప్రధాన కార్యదర్శి పెందోట సోము, కోశాధికారి పొట్టబత్తుల కృష్ణమూర్తి, ఆర్యన్ భజన్స్ పిల్లలమర్రి ఉపేందర్, వంగూరి మణికంఠ పాల్గొన్నారు.