రైతు బీమాపై రంది
కారణాలతో నిమిత్తం లేకుండా కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉండే రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు కేసీఆర్ సర్కార్ దేశంలోనే అత్యుత్తమ పథకం రైతుబీమాను రూపొందించింది. ఆ పథకంపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
- వచ్చే నెల 13తో ముగియనున్న బీమా గడువు
- ఏటా జూలై 10నుంచే దరఖాస్తుల స్వీకరణ
- నేటికీ ఉలుకూ పలుకు లేని సర్కారు
- రైతుబంధులాగే ఇదీ కాలయాపనేనా అన్న అనుమానాలు
- ఆరేండ్లుగా 1.08లక్షల కుటుంబాలకు బాసటగా పథకం
- రైతుబీమాను ఆపొద్దంటున్న రైతులు
కారణాలతో నిమిత్తం లేకుండా కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉండే రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు కేసీఆర్ సర్కార్ దేశంలోనే అత్యుత్తమ పథకం రైతుబీమాను రూపొందించింది. ఆ పథకంపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఒక్కో సంక్షేమ పథకానికి ఎసరు పెట్టే క్రమంలో రైతుబీమాను పక్కన పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. అందుకే ఇప్పటికే మొదలవ్వాల్సిన రైతు బీమా ప్రక్రియ ఉలుకూపలుకు లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న బీమా గడువు వచ్చే నెల 13న ముగియనున్న నేపథ్యంలో ఆలోపే అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేయాల్సి ఉంది. ఇందుకోసం ఈ నెల 10నుంచే రైతు బీమాకు దరఖాస్తులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. రేవంత్‌రెడ్డి సర్కార్ వ్యవహారం చూస్తుంటే దీనికి కూడా ఎగనామం పెడుతారా? అన్న అనుమానం సర్వత్రా నెలకొంది.
– నల్లగొండ ప్రతినిధి, జూలై 14 (నమస్తే తెలంగాణ)
సమైక్య రాష్ట్రంలో రైతులు చనిపోతే దిక్కూమొక్కు లేకుండా ఉండేది. ఇతర రకాల మరణాలను పక్కన పెడితే.. కనీసం వ్యవసాయంలో అప్పుల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం చెల్లింపుల ఊసే ఉండేది కాదు. పైగా ఆత్మహత్యలను అపహాస్యం చేసేలా వ్యవహరించిన తీరు మరణించిన రైతు కుటుంబాలను మానసికంగా ఎంతో కుంగదీసేది. స్వరాష్ట్రంలో రైతులకు అలాంటి పరిస్థితి ఉండొద్దని అప్పటి సీఎం కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టిన బృహత్తర పథకమే రైతు బీమా. రాష్ట్రంలో పట్టాదారు పాసుపుస్తకం కలిగిన ప్రతీ రైతు నిర్ణీత వయస్సు కలిగి ఉంటే ఏ విధంగా చనిపోయినా తక్షణమే ఆదుకోవాలన్నది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రైతులపై ఒక్క పైసా భారం పడకుండా మొత్తం ప్రీమియాన్ని గత కేసీఆర్ సర్కారే చెల్లిస్తూ వచ్చింది. కారణమేదైనా రైతు మరణించిన పది రోజుల్లోపే ఆ కుటుంబానికి ఐదు లక్షల బీమా సొమ్మును అందజేసే విధంగా పథకాన్ని రూపొందించారు. 2018 ఆగస్టు 15నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. భారతీయ జీవిత బీమా (ఎల్ఐసీ) సంస్థ నిబంధనల మేరకు 18 సంవత్సరాలు నిండి 59 సంవత్సరాల్లోపు వయస్సు కలిగిన ప్రతీ రైతును ఈ పథకంలో అర్హులుగా ప్రకటించారు. వారి వివరాలు సేకరించి ప్రీమియం చెల్లింపులు చేశారు. 2018-19 తొలి ఏడాది ఒక్కో రైతుకు రూ.2,271 ప్రీమియం చెల్లించిన ప్రభుత్వం.. 2023-34 సంవత్సరానికి రూ.3600 చెల్లించి బీమాను కొనసాగిస్తూ వచ్చింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆరేండ్లలో 1.08 లక్షల మంది రైతులు మృతిచెందగా.. వారి కుటుంబాలకు రూ.5,402 కోట్లను బీమా సొమ్ముగా చెల్లించి ఆసరాగా నిలిచింది.
నేటికీ దరఖాస్తుల ఉలుకేది?
ప్రస్తుత బీమా పథకం గడువు ఆగస్టు 13న ముగియనుండడంతో రెన్యూవల్ కోసం ఈ పాటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. ప్రతియేటా జూలై 10నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు పెడుతారు. కొత్తగా పాస్‌పుస్తకాలు పొందిన రైతులకు సైతం 18నుంచి 59 ఏండ్ల మధ్య వారైతే అవకాశం కల్పించేవారు. కానీ.. 2024-25 సంవత్సరానికి సంబంధించిన రైతుబీమాపై నేటికీ ప్రభుత్వం వైపు నుంచి ఉలుకూపలుకు లేకపోవడం గమనార్హం. దీనిపై ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో రైతుబంధు పథకం మాదిరిగానే దీన్ని కూడా వాయిదా వేస్తూ వస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు చనిపోయిన సందర్భాల్లో ఆ కుటుంబాలకు ఆర్థికంగా భరోసా ఇస్తున్న కీలకమైన పథకాన్ని సైతం కాంగ్రెస్ సర్కార్ తమ రాజకీయ క్రీడకు వాడుకుంటుందా? అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి భేషజాలకు పోకుండా ఏడాదికి రూ.1500 కోట్లు వెచ్చిస్తే సరిపోయే పథకాన్ని కొనసాగించాలని రైతులు, రైతుసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే రైతుబీమాకు సంబంధించిన కార్యాచరణ మొదలు పెట్టాలని కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 5.60లక్షల మంది అర్హులు
రైతుబీమా పథకంలో రైతుల సంఖ్య ఏటేటా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుత ఏడాది ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 5.60లక్షల మంది రైతులు రైతుబీమా పథకంలో అర్హులుగా ఉన్నారు. ప్రతియేటా జూలై 10 నుంచి ఆగస్టు 4వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ అర్హులైన ప్రతి రైతుకూ అవకాశం కల్పిస్తూ వచ్చారు. ప్రతి ఏడాది ఆగస్టు నుంచి రెన్యూవల్ కానున్న ఈ పథకంలో మరింత మంది రైతులకు అవకాశం లభించింది. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 2.88లక్షల మంది రైతుబీమా పరిధిలోకి రాగా.. ఈ ఏడాది జూన్ నెలాఖరుకు 1,157 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందగా బీమా వర్తింపజేశారు. ఇందులో వెయ్యి మందికి పైగా రూ.50కోట్ల వరకు చెల్లింపులు చేశారు. మిగతా వారికి వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యలో ఎవరి ప్రమేయం లేకుండా పైరవీకారులతో పని లేకుండా పైసా ఖర్చు లేకుండా నేరుగా ఈ సొమ్మంతా రైతు కుటుంబాలకే చెందింది. దీంతో రైతు మరణించిన అనంతరం ప్రభుత్వం చెల్లిస్తున్న బీమా సొమ్ము ఆ కుటుంబాలు నిలదొక్కుకునేందుకు ఎంతో ఆసారానిస్తుంది. అప్పులు, ఇతరత్రా ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగంగా మారాయి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

