రైతు బీమా చెల్లింపులు సూర్యాపేట జిల్లాలో ఆలస్యమవుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో రావాల్సిన బీమా నగదు నెల రోజులు సమయం పడుతున్నది. బీమా డబ్బుల కోసం రైతు కుటుంబాలు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా గతేడాది ఆగస్టు 14 నుంచి ఈ సంవత్సరం ఆగస్టు 14 వరకు 780 మంది రైతులు మరణించగా 674 కుటుంబాలకు మాత్రమే బీమా చెల్లింపులు జరిగాయి. ఇంకా 106 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా నుంచి అప్లోడ్ చేసిన ఎల్ఐసీలో ఎక్కువ సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం
పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ సమస్య వస్తున్నదని తెలుస్తుంది.
నాడు పది రోజుల్లోపే..
రైతు అకాల మరణం ఆ కుటుంబాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టవద్దనే ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. 2018లో ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొని రైతుల పేరిట బీమా ప్రీమియం చెల్లించింది. ఎల్ఐసీ నిబంధనల ప్రకారం 18 నుంచి 59 ఏండ్లు నిండిన రైతులకు ఈ పథకం వర్తింపజేశారు. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి వేలాది మంది రైతు కుటుంబాలను కాపాడింది. రైతు మరణిస్తే రూ. 5 లక్షల ఆర్థిక బీమా సహాయం వస్తుండడంతో ఆ కుటుంబం సమాజంలో నిలదొక్కుకునేలా చేసింది.
రైతు మరణించిన తర్వాత మరణ ధ్రువీకరణ పత్రంతో స్థానిక ఏఈఓతో దరఖాస్తులు అందిస్తే పది రోజుల్లోపే బీమా వచ్చే విధంగా ప్రభుత్వం పథకాన్ని రూపకల్పన చేసింది. నాటి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షణ చేయడంతో సరైన సమయానికి బీమా అందింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు బీమా చెల్లింపులు ఆలస్యమవుతూ వస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న తర్వాత నెల రోజులకు కూడా చెల్లింపులు జరుగడం లేదు. దాంతో రైతు కుటుంబాలు వస్తాయా రావా అనే ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకుంటున్న పరిస్థితి నెలకొంది.
1.63 లక్షల మందికి ప్రీమియం
2024-25 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 1,63,598 మంది రైతులకు రైతు బీమా ప్రీమియం చెల్లించారు. ఆగస్టు 14, 1965 నుంచి ఆగస్టు 14, 2006 మధ్య కాలంలో పుట్టి రాష్ట్ర ప్రభుత్వ పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే వారికి బీమా వర్తిస్తుంది. 1,51,680 మంది రైతులకు రెన్యూవల్ కాగా 11,918 మంది రైతులు కొత్తగా పాస్ పుస్తకాలతో దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రీమియం ఆగస్టు14, 2025 వరకు వర్తించనున్నది.
పెండింగ్‌లో 106 దరఖాస్తులు
2023- 24 సంవత్సరంలో ఆగస్టు 14 నాటికి జిల్లా వ్యాప్తంగా 780 మంది రైతులు వివిధ కారణాలతో మరణించారు. ఇప్పటి వరకు 674 మంది రైతులకు మాత్రమే బీమా నగదు అందింది. ఇంకా 106 మంది రైతుల బీమా పెండింగ్‌లో ఉన్నాయి. స్థానిక అధికారులు అప్లోడ్ చేసినా రాష్ట్ర స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపంతో పెండింగ్‌లో ఉంటున్నాయి. ఎల్ఐసీ సంస్థ వద్దనే పెండింగ్‌లో ఉంటున్నాయని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. జిల్లాలో దాదాపు రూ. 5.30 కోట్లు 106 మంది రైతులకు అందాల్సి ఉంది.
రాష్ట్ర స్థాయిలోనే పెండింగ్‌లో..
గతంలో రైతు మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్న 10 నుంచి 15 రోజుల్లో రైతు బీమా నగదు పడేది. ఇప్పుడు కొంత ఆలస్యమవుతున్నది. జిల్లాలో క్షేత్ర స్థాయి అధికారులు వారి వద్దకు వచ్చిన వెంటనే దరఖాస్తులను అప్లోడ్ చేస్తున్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో పెండింగ్‌లో ఉంటున్నాయి. 25 రోజుల నుంచి 35 రోజుల సమయం పడుతున్నది. జిల్లాలో గత ప్రీమియానికి సంబంధించి 106 మంది రైతులకు బీమా నగుదు రావాల్సి ఉంది. త్వరగా పడేలా చూస్తాం.
-శ్రీధర్‌రెడ్డి , సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి