దామరచర్ల, ఏప్రిల్ 27 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం దళిత కుటుంబాల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపింది. వారి జీవితాల్లో వెలుగులు నింపి ఆర్థిక భరోసా కల్పించి ఆత్మగౌరవంతో బతికేలా చేసింది. నాడు కూలీలుగా ఉన్నవారు ఇప్పుడు ఓనర్లుగా మారి మరికొందరికి పని కల్పిస్తున్నారు. ఈ క్రమంలో దామరచర్ల మండలంలోని 28 మంది దళిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఆ డబ్బుతో లబ్ధిదారులు 21 ట్రాన్స్‌పోర్టు, 7 నాన్ ట్రాన్స్‌పోర్టు యూనిట్లు ఎంచుకున్నారు.
గతంలో కూలీలుగా, తాపీ వర్కర్లుగా, డ్రైవర్లుగా, గుమస్తాలుగా పనిచేసిన యువకులు నేడు ఓనర్లయ్యారు. నాడు పని కోసం ఎదురు చేసిన వారు.. నేడు పనిచ్చే స్థాయికి ఎదిగారు. ప్రభుత్వం కూడా తలచింది ఇదే. అట్టడుగు వర్గాలుగా ఉన్న దళిత కుటుంబాలను ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం మండలంలోని యువకులకు ఉపాధి పరంగా నీడనిచ్చింది. మండలంలో మొత్తం రూ.2.80 కోట్లతో టెంట్‌హౌజ్‌లు, ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు, స్టీల్, జనరల్, సెంట్రింగ్ మెటీరియల్ షాపులు, డెయిరీ ఫామ్‌లు పెట్టుకొ ఉపాధి పొందుతున్నారు. దీంతో తమ బతుకులకు భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటామని లబ్ధిదారులు పేర్కొంటున్నారు.
నాడు గుమస్తా.. నేడు ఓనర్ అయ్యాను
నేను ఇంటర్ వరకు చదివాను. మాది నిరుపేద కుటుంబం. ఆర్థిక పరిస్థితులు బాగోలేక చదువు మధ్యలో మానేసిన. మండల కేంద్రంలోని ఒక షాపులో గుమస్తాగా పనిచేశాను. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం పెట్టడంతో ఎంతో సంతోషపడ్డాను. ఆ పథకం కింద నాకు పది లక్షలు మంజూరయ్యాయి. ఆ డబ్బుతో దామరచర్ల బస్టాండులో స్టీల్, జనరల్ షాపు పెట్టాను. ఇప్పుడు మాకు సొంతంగా షాపు ఉంది.. మేము దానికి ఓనర్లం కావడం ఎంతో గర్వంగా ఉంది. అందుకు కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్ మేలును మర్చిపోలేను.
– సందాల బంగారయ్య, దామరచర్ల
కేసీఆర్ సార్ మేలు మరువలేనిది
మాది నిరుపేద కుటుంబం. నేను తాపీ మేస్త్రీగా పనిచేస్తా. పని ఉంటేనే మా కుటుంబం గడిచేది. దళితులకు న్యాయం చేయాలన్న మంచి ఆలోచనతో సీఎం కేసీఆర్ దళిత బంధు ప్రవేశపెట్టారు. రోజు కూలీగా పనిచేస్తున్న నాకు ఆ పథకం కింద పది లక్షలు మంజూరయ్యాయి. ఆ పైసలతో గ్రామంలో టెంట్‌హౌజ్ పెట్టుకున్నా. అది మా కుటుంబానికి ఆసరా అయితుంది. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. మా కుటుంబానికి సీఎం కేసీఆర్ చేసిన మేలును మరువలేను. మా కుటుంబం ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది.
– బైరం రవీందర్, దామరచర్ల
దళితబంధు ఒక వరం
నేను ఇంటర్ వరకు చదువుకున్నా. ఆర్థ్ధిక పరిస్థితుల కారణంగా చదువు మధ్యలో మానేసిన. అనంతరం ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేశాను. నాకు కొంత వ్యవసాయ భూమి ఉంది. నాకు దళితబంధు పథకం కింద పది లక్షలు మంజూరయ్యాయి. వాటితో ట్రాక్టర్ కొనుక్కున్నా. నా పొలం దున్నకంతోపాటు ఇరత పనులకు పోతున్నా. ఇప్పుడు ట్రాక్టర్‌కు ఓనర్ అయ్యాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. దళితబంధు సీఎం కేసీఆర్ ఇచ్చిన వరం. ఎన్నటికీ మరువలేం. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ దళితులకు మంచి కార్యక్రమం చేపట్టి ఆదర్శంగా నిలిచిండు. కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు.
– బైరం క్రాంతికుమార్, దామరచర్ల
నేనిప్పుడు ఒక షాపు యజమానిని
నేను ఇప్పుడు ఒక షాపు యజమానిని అనుకుంటే విచిత్రంగా ఉంది. ఇది ఎవరూ ఊహించనది. దళితులకు ఇలాంటి పథకాలు ప్రవేశపెడుతారని ఎన్నడూ అనుకోలేదు. నేను చదువుకున్నా. కానీ.. ఉద్యోగం కోసం ప్రయత్నించలేదు. మండలంలో తాపీ మేస్త్రీగా పనిచేస్తాను. రోజు కూలికి పోయే నాకు సీఎం కేసీఆర్ పుణ్యాన దళిత బంధు కింద పది లక్షల రూపాయలు వచ్చినయి. వాటితో ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే హౌజింగ్ మెటీరియల్ తీసుకొని కిరాయికి ఇస్తున్నా. మండలంలో ఇలాంటి షాపు లేదు. మంచిగా నడుస్తుంది. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– పల్లా రాంప్రసాద్, దామరచర్ల