నల్లగొండ గుండెల్లో బైపాస్ గుబులు
నల్లగొండ పట్టణం మధ్యలోంచి వెళ్తున్న 565వ నంబర్ జాతీయ రహదారితో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయంగా బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
- ఎన్‌హెచ్ 565కు బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం స్థలాల సేకరణ
- బైపాస్ కోసం మూడు ప్రతిపాదనలు
- తీవ్ర నష్టం జరిగే ఆప్షన్-3కి మంత్రి కోమటిరెడ్డి గ్రీన్‌సిగ్నల్
- 3వేల మంది జీవితాలపై ప్రభావం
- తీవ్ర ఆందోళనతో పోరుబాటలో బాధితులు
- మంత్రి అనుచరుల కోసమే ఆప్షన్-3 ఎంపిక అంటూ ఆరోపణలు
- ప్రస్తుత ప్లాన్ రద్దు చేయాల్సిందే : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల
నల్లగొండ ప్రతినిధి, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ పట్టణం మధ్యలోంచి వెళ్తున్న 565వ నంబర్ జాతీయ రహదారితో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయంగా బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ బైపాస్ నిర్మాణం కోసం ప్రస్తుతం ఎంచుకున్న ప్లాన్ మాత్రం ప్రజల గుండెల్లో గబులు రేపుతున్నది. బైపాస్ నిర్మాణం కోసం మొత్తం మూడు ప్రతిపాదనలు సిద్ధ్దం చేయగా అందులో పట్టణానికి ఆనుకుని శివారు కాలనీల్లోని ఇండ్లు, ఇండ్ల స్థలాల మీదుగా ఎంపిక చేసిన మూడో ప్రతిపాదన(ఆప్షన్-3) ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
పట్టణానికి తూర్పు నుంచి కేవలం వ్యవసాయ భూముల నుంచే ప్రతిపాదించిన మొదటి ప్రతిపాదన, పశ్చిమం నుంచి వ్యవసాయ భూములు, కొన్ని ప్లాట్ల మీదుగా ప్రతిపాదించిన రెండో ప్రతిపాదనలతో పెద్దగా నష్టం వాటిల్లదని ప్రజల భావన. కానీ పట్టణ శివారు కాలనీల్లోని సుమారు 2,700 ఇండ్ల స్థలాలు, 200 వరకు ఇండ్లపై ప్రభావం చూపే మూడో ప్రతిపాదనను ఎంపిక చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. దీంతో ప్రస్తుత బైపాస్ రోడ్డు ప్రతిపాదనలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు కోల్పోతున్న బాధితులు ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తక్షణమే స్పందించి అలైన్‌మెంట్‌ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆప్షన్-1, 2 వదిలేసి..
ఎన్‌హెచ్-565 బైపాస్ రోడ్డు నిర్మాణం పట్టణ ప్రజల్లో కలకలం సృష్టిస్తున్నది. నకిరేకల్ నుంచి మాచర్ల వెళ్లే జాతీయ రహదారి నల్లగొండ పట్టణం మధ్యలోంచి వెళ్తుండడం వల్ల రోడ్డు విస్తరణలో పెద్దఎత్తున ప్రజలు వ్యాపార సముదాయాలను కోల్పోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ సమస్య కూడా తీవ్ర రూపం దాల్చనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా పట్టణ ప్రజలు, వివిధ పార్టీల నేతల డిమాండ్‌తో పాటు ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంప్రదింపుల మేరకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) స్పందిస్తూ బైపాస్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పట్టణానికి వెలుపల నుంచి వెళ్లేలా మూడు ప్రతిపాదనలు సిద్ధ్దం చేసి ఇవ్వాలని ఎన్హెచ్ఏఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
దాంతో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 6న మూడు ప్రతిపాదనలు సమర్పించారు. ఇంత వరకు బాగానే ఉన్న ఈ మూడింటిలో ప్రజల ఆస్తులకు ఎక్కువ నష్టం జరిగే ప్రతిపాదనకు తుది ఆమోదం లభించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అదే నెల 20న మూడో ఆప్షన్‌కు ఆమోదం తెలుపుతూ ఎన్హెచ్ఏఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వెంటనే 29న ప్రతిపాదిక అలైన్మెంట్ ప్రకారం సర్వేకు ఆదేశాలిచ్చారు. సర్వే పూర్తయ్యాక గత నెల 2న నిర్మాణం కోసం అగ్రిమెంట్ పూర్తి చేశారు. ఈ ప్రక్రియ అంతా ఎక్కడా ఆన్లైన్లో లేకుండా గెజిట్ నోటిఫికేషన్ సైతం బయటకు రాకుండా రహస్యంగా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆందోళలన తీవ్రరూపం
బైపాస్ రోడ్డు నిర్మాణ బాధితులు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. వివిధ పార్టీల నేతలకు తమ గోడును వెల్లబోసుకోవడంతో విపక్ష నేతలు వీరికి సంఘీభావం ప్రకటించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి బాధితుల పక్షాన రంగంలోకి దిగారు. తన క్యాంపు ఆఫీసులో బాధితులతో సమావేశమై వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శుక్రవారం బాధితులతో కలిసి కంచర్ల భూపాల్‌రెడ్డి కలెక్టరేట్‌కు వెళ్లి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి పరిస్థితిని వివరించారు.
తొలి ప్రతిపాదననే పరిగణలోకి తీసుకుని ప్రజల ఆస్తులను రక్షించాలని కలెక్టర్‌ను కోరారు. పది, ఇరవై ఏండ్ల కిందట వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ప్లాట్లు, కట్టుకున్న ఇండ్ల విలువు ప్రస్తుతం లక్షలకు చేరకుంది. ప్రస్తుత బైపాస్ నిర్మాణం వల్ల చాలా మంది తీవ్ర నష్టపోవాల్సి వస్తుందని కలెక్టర్‌కు బాధితులు కూడా మొరపెట్టకున్నారు. బైపాస్ రోడ్డుకు తాము వ్యతిరేకం కాదని, వ్యవసాయ భూముల నుంచి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ కమర్షియల్ మడిగెలు, ఇండ్లు, ఇంటి స్థలాల మీదుగా రోడ్డు వేయడానికే తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.
మంత్రి అనుచరుల కోసమేనంటూ ఆరోపణలు
మొత్తం మూడు ప్రతిపాదనల్లో తక్కువ నష్టం కలిగించే తొలి రెండు ప్రతిపాదనలను పక్కన పెట్టి మూడో ప్రతిపాదనకు మొగ్గు చూపడంలో అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి కీలక అనుచరుల భూములకు దగ్గరగా మూడో ప్రతిపాదన ఉండడంతోనే దీన్నే ఆమోదించేలా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఒకరిద్దరి అనుచరుల భూముల కోసం వేలాది మంది ఆస్తులను పణంగా పెట్టడం సరికాదంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
కేవలం వ్యవసాయ భూముల మీదుగా వెళ్లే 11 కిలోమీటర్ల తొలి ప్రాతిపాదననే ఆమోదించాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పలుమార్లు స్వయంగా బాధితులు కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. అయినా మార్పు లేకపోవడంతో కతాల్‌గూడ వద్ద మంత్రి కోమటిరెడ్డిని బాధితులు వారం రోజుల క్రితం ఘోరావ్ చేశారు. ఇప్పుడు తానేమీ చేయలేనంటూ నష్టపరిహారం ఇప్పించడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆప్షన్-3తో భారీ నష్టం
పానగల్ ఉదయ సముద్రం చెరువు గేట్ల నుంచి కేశరాజుపల్లి మీదుగా సాగర్ రోడ్డుకు కలిపేలా 11 కిలోమీటర్లతో కూడిన తొలి ప్రతిపాదన పూర్తిగా వ్యవసాయ భూముల్లో నుంచే వెళ్లనుంది. దీని నిర్మాణ వ్యయం కూడా తక్కువే. రెండో ప్రతిపాదన 20 కిలోమీటర్ల మేర ఉండగా పానగల్ శివారు నుంచి కట్టంగూరు రోడ్డు మీదుగా అన్నేశ్వరమ్మ గుట్ట, చర్లపల్లి బయటి నుంచి, కంచనపల్లి సమీపం నుంచి సాగర్ రోడ్డుకు కలుస్తుంది. ఇకడ వ్యవసాయ భూములతో పాటు కొద్ది మేర ఇండ్ల స్థలాలకు నష్టం జరుగనుంది. దీని వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు.
కానీ ఈ రెండింటినీ పక్కన పెట్టి పానగల్, మర్రిగూడ బైపాస్ చౌరస్తా నుంచి పట్టణానికి ఆనుకుని లతీఫ్‌సాహెబ్ గుట్ట వెనకాల ఇప్పటికే ఉన్న రోడ్డు మీదుగా కతాల్‌గూడ, కొత్తపల్లి గ్రామాల నుంచి 15 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన మూడో ప్రతిపాదన(ఆప్షన్-3)కి ఆమోదం తెలుపడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతున్నది. ఇందులో బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం 2,734 ఇండ్ల స్థలాలు, కమర్షియల్ మడిగెలు, 194 ఇండ్లు కోల్పోవాల్సి వస్తుంది. సుమారు మూడు వేల కుటుంబాల జీవితాలు ఇందులో ముడిపడి ఉండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది. కష్టపడి సంపాదించుకున్న వందల కోట్ల విలువైన ఆస్తిని నష్టపోవాల్సి వస్తుందని బాధితులు మండిపడుతున్నారు.
అనుచరులకు దోచిపెట్టేందుకే ఇది
బైపాస్ రోడ్డు నిర్మిస్తూ దీన్ని రింగ్ రోడ్డుగా చెప్పడం మంత్రి కోమటిరెడ్డికే చెల్లింది. ఈ బైపాస్ రోడ్డును సైతం ఆయన అనుచరులకు దోచిపెట్టేందుకే ఆప్షన్-3ని ఆమోదించేలా చేశారు. అనుచరుల భూముల కోసం మూడు వేల మంది ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇది ఎంతమాత్రం క్షమించరానిది. బైపాస్ రోడ్డు కోసం తక్కువ నష్టం జరిగే ప్రతిపాదనలను ఎందుకు వదిలేశారో ప్రజలకు మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఇదే మంత్రి ప్రతిపక్షంలో ఉండి పానగల్, దేవరకొండ రోడ్డుల్లో ఎన్‌హెచ్-565 నిర్మాణం జరుగుతుంటే ప్రజల ఆస్తులను బలవంతంగా కూలగొట్టారని రెచ్చగొట్టింది నిజం కాదా. మంత్రి కాగానే నాలుక మడతేస్తారా? ఇప్పుడు ప్రజల ఆస్తులు కనిపించడం లేదా స్పష్టం చేయాలి. తక్షణమే మంత్రి స్పందించి ప్రస్తుత ప్రతిపాదనను వెనక్కి తీసుకునేలా చూడాలి. లేదంటే బాధితుల పక్షాన ఎంతవరకైనా పోరాటానికి సిద్ధ్దం.
– కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నల్లగొండ
మా ఒక్క కాలనీలోనే 64 ప్లాట్లు పోతున్నాయి
మాది కనగల్ మండలం పగిడిమర్రి గ్రామం. నా వయసు 40 ఏండ్లు. నేను ఇన్నాళ్లు కష్టపడి సొంత ఇల్లు కట్టుకుందామని దేవరకొండ రోడ్డులోని శివాంజనేయ గార్డెన్ సమీపంలో 150 గజాల ప్లాటు కొన్నా. నాకు కూడా ప్లాటు ఉందని సంతృప్తి పడుతున్న సమయంలో ఈ ప్లాటు ఎన్‌హెచ్-565 కింద విస్తరణలో భాగంగా పోతుందని తెలిసి చెప్పలేని బాధ అవుతున్నది. ఈ హైవేకు మొదట మొదటి అలైన్ మెంట్ ద్వారా రోడ్డు వేస్తారని చెప్పి కొంతమంది స్వార్థం కోసం చీకట్లో మూడో అలైన్ మెంట్ సృష్టించడం వల్ల ఇవ్వాళ నాలాంటి వాళ్లు ఎంతో నష్టపోతున్నారు. మా కాలనీలో 64 మంది తమ ప్లాట్లు కోల్పోతున్నారు. ఫస్ట్ పానగల్ నుంచి దుప్పలపల్లి ద్వారా రోడ్డు వేస్తారని చెప్పి ఇప్పుడు ఇక్కడ తీయటమేందో అర్థ్దం కావట్లేదు. పైగా ఈ అలైన్మెంట్ ఈ ఏడాది ఫిబ్రవరి-20నే రెడీ చేసి ఎన్నికలు ఉండటంతో ఇన్నాళ్లు ఆపి ఇప్పుడు బయట పెట్టారు. దీన్ని ఎలాగైనా ఆపి మాలాంటి పేద వాళ్లకు న్యాయం చేయాలి.
– కందిమల్ల శంకర్ రెడ్డి, పగిడిమర్రి, కనగల్ మండలం
చావడం తప్ప వేరే మార్గం లేదు
నేను ఏడాదిన్నర కింద మర్రిగూడ బైపాస్ దగ్గర షట్టర్ మడిగెలు గజం అరవై వేలు పెట్టి 360 గజాలు కొన్నా. ఇయ్యాల ఆ భూమి మీదంగా రోడ్డు వేస్తే మా కుటుంబం ఎలా బతకాలి. మేము చావటం తప్ప వేరే మార్గం లేదు. ఫీల్డ్ విచారణ చేయకుండానే గూగుల్ మ్యాప్ ఆధారంగా అలైన్‌మెంట్‌ను రూపొందించడంతోనే సమస్య వచ్చింది. ఆఫీసుల్లో, ఇండ్లల్లో కూర్చొని తయారు చేశారు. అయినా పానగల్ నుంచి వచ్చే హైవే మర్రిగూడ బైపాస్ నుంచి తీసుకొని వచ్చి మళ్లీ సక్కగా అదే ఏరియాలో ఉన్న ఎస్ఎల్బీసీలో కలుపడం ఏంటి? అదే ప్రాంతం నుంచి మొదటి అలైన్మెంట్ ద్వారా దుప్పలపల్లి నుంచి తీసుకెళ్తే బాగుంటది కదా. దీన్ని మరోసారి ఆలోచించి రద్దు చేసి పాత అలైన్ మెంట్ ద్వారానే నిర్మించాలి.
– ఎర్రబోతు యాదగిరి రెడ్డి, నల్లగొండ
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

