గుండాల, జూన్ 15 : ఆ అవ్వ వయస్సు 105 ఏండ్లు. అయినప్పటికీ నేటికీ ఆరోగ్యంగా ఉంది. మండలంలోని కొమ్మాయిపల్లి గ్రామ పరిధిలోని లక్ష్మీతండాకు చెందిన భూక్య సాలమ్మ ఇటీవలే 105 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆమెకు ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా ఇద్దరు కుమారులు మరణించారు. సాలమ్మ కుమారులు, కుమార్తెల సంతానం సుమారు 80 మంది వరకు ఉన్నారు. సాలమ్మ 4 తరాల వారసులను చూసింది.
ఈ సందర్భంగా సాలమ్మ మాట్లాడుతూ.. నాడు జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు తిన్నందునే నేటికీ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు దవాఖానకు వెళ్లే అవసరమే రాలేదని చెప్పింది. ఇప్పటికీ ఇంటి పనుల్లో కుటుంబ సభ్యులకు సాయం చేస్తుంది. సాలమ్మను ఉద్దేశించి తండావాసులు మాట్లాడుతూ.. నేటి తరం వాళ్లు 30 ఏండ్లకే అనారోగ్యంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని, సాలమ్మ మాత్రం 105 ఏండ్లు వచ్చినా ఆరోగ్యంగానే ఉండడం గొప్ప విషయమని అంటున్నారు.