శుక్రవారం 29 మే 2020
Mulugu - Feb 21, 2020 , 03:27:25

పల్లెలు మెరవాలి..

పల్లెలు మెరవాలి..

‘పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు మెరవాలి. అద్దంలా తయారు కావాలి’ అని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పంచాయతీ రాజ్‌ సమ్మేళనం కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన గురువారం జరిగింది.

  • గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యం
  • పంచాయతీ రాజ్‌ సమ్మేళనంలో మంత్రి సత్యవతి రాథోడ్‌
  • రాష్ట్రంలో రూ. 45 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు
  • వీటి ద్వారా ప్రతి ఇంటికీ లబ్ధి
  • ప్రజల భాగస్వామ్యంతో పల్లెలను బాగు చేసుకోవాలి
  • ప్రగతి సాధించిన గ్రామాలకు ప్రత్యేక నిధులు
  • ప్రజాప్రతినిధులు పోటీ పడి పనిచేయాలి
  • సర్పంచ్‌లు స్థానికంగా ఉండాలి
  • అభివృద్ధిలో అగ్రభాగాన నిలపాలి
  • జిల్లాకు అధిక నిధులు కేటాయిస్తా..

‘పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు మెరవాలి. అద్దంలా తయారు కావాలి’ అని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పంచాయతీ రాజ్‌ సమ్మేళనం కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి  హాజరై పల్లె ప్రగతి ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సత్యవతిరాథోడ్‌ మాట్లాడుతూ పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యమిచ్చి నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పల్లెలను బాగు చేసుకోవాలని సూచించారు. ప్రగతి సాధించిన గ్రామాలకు ప్రత్యేక నిధులు ఇస్తామని, ప్రజాప్రతినిధులు పోటీ పడి పనిచేయాలని కోరారు. అభివృద్ధిలో అగ్రభాగాన నిలపాలని, జిల్లాకు అధిక నిధులు కేటాయిస్తానని పేర్కొన్నారు.

- ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తే తెలంగాణ


ములుగు జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలు మెరవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. పల్లె ప్రగతి సమగ్ర నిర్వహణ కోసం పంచాయతీ రాజ్‌ చట్టంపై అవగాహన కల్పించేందుకుగాను  గురువారం  జిల్లా కేంద్రంలోని లీలాగార్డెన్‌లో కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అధ్యక్షతన నిర్వహించిన  పంచాయతీరాజ్‌ సమ్మేళానానికి  మంత్రి సత్యవతి రాథోడ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడారం జాతర విజయవంతం అయ్యేందుకు సహకరించిన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత సర్పంచ్‌లు అదృష్టవంతులని, గత కాలంలో సర్పంచ్‌లకు అరకొర నిధులు వచ్చేవని, అవి కూడా తాగునీటి కోసం సరిపోయేదికాదన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే రైతులు ధర్నాలు చేసే వారని , పంట పొలాలకు నీరు లేదని ఆందోళనలు చేసే వారని, ప్రస్తుతం పరిస్థితి మారిందన్నారు.  సీఎం కేసీఆర్‌ చొరవతో మిషన్‌ భగీరథ ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా అవుతుందని, 24గంటలు నాణ్యమైన కరంట్‌ను అందిస్తున్నామన్నారు.  సీఎం కేసీఆర్‌ నిర్మించిన ప్రాజెక్టులతో పంటలకు సరిపడ నీరు వస్తోందన్నారు.  


 పోటీ పడి పనిచేయాలి..  

గ్రామాల్లో పేరుకుపోతున్న చెత్తను తొలగించేందుకు ప్రతి గ్రామపంచాయతీకి పారిశుధ్య  కార్యక్రమం కింద  ట్రాక్టర్లను అందిస్తున్నామని మంత్రి అన్నారు. గతంలో ఐదు సంవత్సరాల  సర్పంచ్‌ల పాలన కాలంలో పావు వంతు పనులు కూడా పూర్తి కాకపోయేవని, ప్రస్తుత సర్పంచ్‌లు వచ్చి ఏడాది కూడా కాకముందే వారు ఇచ్చిన హామీలు నేరవేరుతున్నాయన్నారు.  తద్వారా వారి పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ఆర్థిక మాంద్యం ఉన్న నెలకు రూ. 339కోట్లు కేటాయిస్తున్నారన్నారు. అంతేకాకుండా కలెక్టర్‌ దగ్గర ఉన్న నిధులు కూడా బాగా పనిచేసిన వారికి  ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అందుకే  సర్పంచ్‌లు, పోటీ పడి పనిచేసి పల్లె ప్రగతి చేపట్టాలని సూచించారు. 


 పల్లె నిద్రలు.. 

పల్లె ప్రగతి విజయవంతం చేసేందుకు పల్లె నిద్రలను చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. సర్పంచ్‌లు ప్రజలకు  అందుబాటులో ఉండాలన్నారు. రాష్ట్రంలో రూ. 45వేల కోట్లతో పలు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండాలని,  అనంతరం అభివృద్ధి  కోసం అందరు సమష్టిగా పనిచేయాలన్నారు. 


 అడవులను అభివృద్ధి  చేయాలి.. 

జిల్లాలో అడవులను అభివృద్ధి చేయాలని మంత్రి సత్యవతి అన్నారు. హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలను నాటాలన్నారు.  నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలన్నారు. హరితహారం నిర్వహణ కోసం నర్సరీలను ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటిక నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రస్తుతం 1, 2వ దశల్లో ఈ కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని, 3వ దశలోనూ మిగతా  గ్రామాల్లో డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటికల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. పల్లె ప్రగతి అత్యధికంగా సాధించిన, సాధించని గ్రా మాలను గుర్తించాలని, అత్యధిక అభివృద్ధి సాధించిన గ్రామాల కు ప్రత్యేక నిధులు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 


 జిల్లాను అగ్రగామిగా నిలపాలి..

పల్లెప్రగతిలో ములుగు జిల్లాను అగ్రగామిగా నిలపాలని మంత్రి పిలుపునిచ్చారు.  జిల్లాలో ఉత్సాహ వంతులైన అధికారులు, యువకులు ఉన్నారన్నారు. జిల్లాను అగ్రగామిలో నిలిపేందుకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. 


గ్రామాల సమగ్రాభివృద్ధి బాధ్యత సర్పంచ్‌లదే.. 

 పల్లె ప్రగతి కార్యక్రమాలను ప్రణాళిక ప్రకారం చేపట్టి  గ్రామాల అభివృద్ధికి సహకరించాలని జెడ్పీచైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ అన్నారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల స్వరూపాలను  మార్చేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తున్నారని తెలిపారు. అందుకే గ్రామాల అభివృద్ధి సర్పంచ్‌లపై ఉందని వెల్లడించారు. జిల్లాను  అభివృద్ధిలో అగ్రభాగాన నిలపాలన్నారు. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించేందుకు అధికారులు సహకరించాలని కోరారు.  


పల్లె ప్రగతి ప్రజాప్రగతి..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా ప్రజా ప్రగతి వెల్లివిరియాలని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గ్రామాల్లో  అనేక సమస్యలు ఉన్నాయని, పల్లె ప్రగతి ద్వారా అవి పరిష్కారం కావాలని ఆకాక్షించారు. స్థానికంగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించే బాధ్యత సర్పంచ్‌లపై  ఉందని తెలిపారు. కుల, మత, రాజకీయాలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. 


అభివృద్ధి ముఖ్యం.. 

 కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకాం గ్రామాలను అభివృద్ధి  చేసే బాధ్యత సర్పంచ్‌లదేనని జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య తెలిపారు. పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియ అని, గ్రామాలు గొప్పగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలని , ఇందు కోసం నిధుల ఖర్చు, రాబడిని అంచనా వేసుకోవాలన్నారు.  ఐటీడీఏ పీఓ హన్మంతు కొండిబా మాట్లాడుతూ ఒకటి, రెండు విడతల పల్లె ప్రగతిలో  మిగిలిన పనులను పూర్తి చేసుకుంటూ గ్రామాల్లో  పారిశుధ్యం పనులను ఎప్పటికప్పుడు నిర్వహించాలని సూచించారు. మొక్కలు విరివిగా నాటి వాటిని సంరక్షించాలన్నారు.  ప్రతి 4వేల మొక్కలకు వాచర్‌ను పెట్టుకునే అవకాశం ఉందని తెలిపారు. మురుగు  కాల్వలను నిరంతరం శుభ్రం చేయాలని, ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే సీతక్క మంత్రి సత్యవతి రాథోడ్‌ను సన్మానించి మెమోంటో అందించారు. మేడారం జాతర చైర్మన్‌ ఆలెం రామ్మూర్తి మంత్రి, జెడ్పీచైర్మన్‌తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులకు తల్లుల ప్రసాదం  అందజేశారు.  సమావేశంలో  అడిషనల్‌ కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి, డీఎఫ్‌వో ప్రదీప్‌కుమార్‌శెట్టి, జెడ్పీసీఈవో పారిజాతం, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, ఏపీవో వసంతరావు, ములుగు, గోవిందరావుపేట ఎంపీపీలు గండ్రకోట శ్రీదేవి, శ్రీనివాస్‌రెడ్డితో పాటు జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు,  తదితరులు పాల్గొన్నారు. 


logo