సలాకార్: ది లెజెండ్ ఆఫ్ యాన్ ఎక్స్ట్రార్డినరీ ఇండియన్ స్పై
జియో హాట్‌స్టార్: స్ట్రీమింగ్ అవుతున్నది.
తారాగణం: నవీన్ కస్తూరియా, ముఖేష్ రిషి, మౌని రాయ్, సూర్య శర్మ, పూర్ణేందు భట్టాచార్య తదితరులు
దర్శకత్వం: ఫరూక్ కబీర్
భారత్‌కు ప్రధాన శత్రువు.. పాకిస్థాన్! ఈ దాయాది దేశంతో వైరం నేటిది కాదు. అఖండ భారత్ రెండుగా విడిపోయినప్పటి నుంచే మొదలైంది. అప్పటినుంచి ఇప్పటిదాకా.. ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ వైరం, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కాయి. భారత సైన్యం, గూఢచారుల ధైర్య సాహసాలను కళ్లకు కట్టాయి. శత్రుదేశపు కుట్రలను భగ్నం చేసిన ఓ గూఢచారి కథే.. సలాకార్ : ది లెజెండ్ ఆఫ్ యాన్ ఎక్స్ట్రార్డినరీ ఇండియన్ స్పై. మొత్తం ఐదు ఎపిసోడ్స్‌గా రూపొందిన ఈ సిరీస్.. ‘జియో హాట్‌స్టార్’లో రికార్డ్ స్ట్రీమింగ్ నమోదు చేసుకుంటున్నది.
కథ విషయానికి వస్తే.. 1978తోపాటు 2025లోనూ సాగుతుంది. ప్రస్తుత పాకిస్థాన్‌లో బ్రిగేడియర్‌గా పనిచేస్తున్న అష్ఫాక్ ఉల్లా (సూర్య శర్మ).. ఒక ఫైల్ కోసం వెతుకుతుంటాడు. పాకిస్థాన్‌లో అక్రమంగా అణుబాంబులు తయారు చేయడానికి అవసరమైన ప్రాజెక్టు ఫైల్ అది. 1978లో పాకిస్థానీ మిలటరీ
డైరెక్టర్, అష్ఫాక్ తాత అయిన జియా ఉల్ హక్ (ముఖేష్ రిషి).. ఆ ప్రాజెక్టును మొదలుపెడుతాడు. అణుబాంబు తయారుచేసి భారత్‌పై ప్రయోగించాలనేది అతని జీవితాశయం. అయితే, ఆ పనిని పూర్తిచేయలేక పోతాడు. తాత కలను నెరవేర్చాలని అష్ఫాక్ రంగంలోకి దిగి.. ఆ ఫైల్‌ను చేజిక్కించుకుంటాడు. ఈ విషయం ఢిల్లీలోని ‘రా’కు తెలుస్తుంది.
దాంతో వాళ్లు సీక్రెట్ ఏజెంట్‌గా సృష్టి చతుర్వేది (మౌనీ రాయ్)ను రంగంలోకి దింపుతారు. ఈ క్రమంలో సృష్టి చతుర్వేదికి ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు 1978లో ఏం జరిగింది? అణుబాంబులు తయారు చేసి, భారత్‌పై ప్రయోగించాలనుకున్న జనరల్ జియా ఉల్ ఎందుకు విఫలమయ్యాడు? అప్పట్లో అతణ్ని ఎదుర్కొన్నది ఎవరు? అష్ఫాక్ మాస్టర్ ప్లాన్ తెలుసుకోవడానికి ‘రా’.. సృష్టి చతుర్వేదినే ఎందుకు ఎంచుకున్నది? అతని ప్రయత్నాలకు ఫుల్స్టాప్ పెట్టడానికి సృష్టి చేసే ప్రయత్నం ఫలిస్తుందా? అనేది మిగతా కథ. ప్రతి ఎపిసోడ్‌లోనూ ఓ మలుపు ఆసక్తి కలిగిస్తుంది. సిరీస్ అంతా ఏకబిగిన చూసేలా పకడ్బందీగా స్క్రీన్ ప్లే కొనసాగుతుంది.